ముద్రగడ కాపు గర్జన: జగన్ వైపా, కాంగ్రెసు వైపా?
హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన తలపెట్టిన కాపు గర్జనపైనే అందరి దృష్టీ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాపులను ఐక్య పరిచే ఉద్దేశంతో ఈ సభను తలపెట్టారనే విషయంలో అవాస్తవమేమీ లేదు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈ సభను తలపెట్టారు.
తెలుగుదేశం పార్టీకి దూరంగా కాపు నాయకులంతా ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. దర్శకరత్న, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావును కూడా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. నిజానికి, కోస్తాంధ్రలో కాపు, కమ్మ సామాజిక వర్గాలు కలిసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన అరుదైన సందర్భం గత ఎన్నికల్లో చోటు చేసుకుంది.
అది కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడకపోగా, తెలుగుదేశం పార్టీకి మాత్రం ఉపయోగపడింది. కాంగ్రెసులో చిరంజీవి, బొత్స సత్యనారాయణ వంటి నాయకులు ఉన్నా కాంగ్రెసు ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. కాంగ్రెసుపై రాష్ట్ర విభజన ప్రభావం ప్రతికూలంగా పనిచేసిందని అంటున్నారు. దాంతో చిరంజీవి జనాకర్షణ కూడా పనిచేయలేదని చెబుతారు.

టిడిపి, బిజెపి కూటమికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయి వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దెబ్బ తిన్నదని అంటున్నారు దాంతో టిడిపి, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం బలంగా ఉంది. అదే సమయంలో నరేంద్ర మోడీ నాయకత్వం కూడా ఆ కూటమికి కలిసి వచ్చింది.
ఇప్పుడు, ముద్రగడ పద్మనాభం కాపు గర్జన ద్వారా టిడిపికి లభిస్తున్న కాపు సామాజిక వర్గం మద్దతును బద్దలు కొట్టాలని భావిస్తున్నారు. దీన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో బహిరంగంగానే ఆయన సభకు వైయస్సార్ కాంగ్రెసు మద్దతు ప్రకటించింది. వంగవీటి మోహన రంగా ఇమేజ్‌ను కూడా దీనికి వాడుకుంటున్నారు. ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు వైపు ఉండడం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెసు పార్టీ కూడా దాన్ని వాడుకునే ప్రయత్నంలో ఉంది. అయితే, చిరంజీవి మినహా కాపు నాయకులు చాలా మంది ఇప్పటికే పార్టీని వీడిపోయారు. చిరంజీవి కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. పైగా, వంగవీటి రంగాను వాడుకోవడానికి ఆ పార్టీ అంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇది కాంగ్రెసు పార్టీకి మైనస్ పాయింట్లే అవుతాయి.
కాగా, ముద్రగడ పద్మనాభం ద్వారా జరుగుతున్న ప్రయత్నాలు ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. కాపులకు తాము చేసిన కార్యక్రమాల గురించి ఆ పార్టీ నాయకులు వివరిస్తూ వస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి వివరిస్తున్నారు.
అయితే, పద్మనాభం గర్జన వల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు. అయితే, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాపు ఎజెండాతో సమీకరణాలను మార్చే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నారు. ఆయన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనే ఇప్పుడే చెప్పలేం.












Click it and Unblock the Notifications