చక్రం తిప్పుతున్న నారా లోకేష్: పచ్చ జెండా ఊపిన చంద్రబాబు!
విజయవాడ: చంద్రబాబు కేబినెట్లోకి టిడిపి యువనేత నారా లోకేష్ రంగానికి సిద్ధమైందా? త్వరలో ఆయనను ప్రభుత్వంలోను భాగస్వామిని చేసే అవకాశముందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా ఆయనను కేబినెట్లోకి తీసుకునేందుకు సముఖంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
లోకేష్ చేరిక పైన చంద్రబాబు పరోక్షంగా పచ్చ జెండా ఊపారని అంటున్నారు. చంద్రబాబు పత్రికలకు ఇటీవల ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇందులో భాగంగా లోకేష్ గురించి మాట్లాడుతూ.. ఆయనను కేబినెట్లోకి తీసుకుంటే, మంత్రిగా చూస్తే తప్పేమిటని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే మంత్రివర్గ విస్తరణలో లోకేష్‌కు చోటు దక్కడం ఖాయమని చాలామంది భావిస్తున్నారు. లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్ రెడ్డి వంటి చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

గత రెండేళ్ల నుంచి నారా లోకేష్ ఇటు పార్టీ కార్యకలాపాల్లోనూ, అటు ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఆ సందర్భంగా జిల్లా నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ నాయకులను పిలిపించి, ముందు వారితో మాట్లాడుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు చేరినప్పటికీ, మీ ప్రాధాన్యం ఎట్టి పరిస్థితిలోనూ తగ్గదని భరోసా ఇస్తున్నారు. మంత్రి టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ ఇవ్వడంలో లోకేష్ ప్రముఖ పాత్ర పోషించారు. ఈ విషయాన్ని టీజీ వెంకటేషే స్వయంగా చెప్పారు.
లోకేష్ కొత్త టీం!
లోకేష్ ఇప్పటినుంచే తన సొంత టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు. సీనియర్ల ప్రాధాన్యతను క్రమంగా తగ్గించి, వారి తనయులు, యువ నేతలతో కొత్త బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిగా యువకులతో నింపి, సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడం లేదా కౌన్సిల్‌కు, రాజ్యసభకు పంపించాలన్నది అసలు లక్ష్యమంటున్నారు.
దానితో సీనియర్లు గత కొద్దికాలం నుంచి లోకేష్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్లతో వయసు రీత్యా ఉన్న అంతరం, ఆలోచనలో ఉన్న వ్యత్యాసం, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని, లోకేష్ కొత్త టీంను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications