చిరు టు బాబు: పవన్ కళ్యాణ్ విషయంలో భయం, కారణముంది?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అయితే, పవన్ గతంలోలాగే ఇప్పుడు కూడా ఇలా వచ్చి అలా వెళ్తారా అనే చర్చ సాగుతోంది. అయితే, రాజకీయాల పైన పూర్తిగా డిసైడ్ అయిన పవన్ కళ్యాణ్ ఇక వెనుకంజ వేయకపోవచ్చునని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, గతంలో ఆయన వెనక్కి పోవడానికి కూడా పలు కారణాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి.
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత 2009లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించారు. పవన్ ఎప్పుడు మాట్లాడినా ఆవేశంగా మాట్లాడుతున్నారు. నాటి ఎన్నికల్లో అయితే.. కాంగ్రెస్ నేతలను గుడ్డలూడదీసి కొట్టాలనే డైలాగ్ ఇప్పటికీ అందరి మెదళ్లలో నానుతుంటుంది. అయితే, ఆ తర్వాత ఆయన కనుమరుగయ్యారనే చెప్పవచ్చు.
యువరాజ్యంకు చీఫ్‌గా ఉన్నప్పటికీ.. రాజకీయ కార్యకలాపాల్లో కీలకంగా పని చేసింది లేదనే వాదనలు ఉన్నాయి. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపారు. ఈ కారణంగానే పవన్ ఇన్నాళ్లు దూరంగా ఉన్నారనే వాదన ఉంది. ప్రజారాజ్యం పార్టీ అలాగే కొనసాగి ఉంటే.. ఇప్పటికే ఎప్పుడో క్రియాశీలకం అయ్యేవారనే వారు లేకపోలేదు.

2009 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడానికి ఒకవిధంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే కారణమనే వారు ఉన్నారు. ఏదేమైనా ఆ తర్వాత ఆయన కనుమరుగయ్యారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లోను పవన్ కళ్యాణ్ బీజేపీ-టీడీపీ కూటమి తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏడెనిమిది నెలల వరకు ఆయన మౌనంగా ఉన్నారు.
కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీలు ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, అయినప్పటికీ పవన్ కళ్యాణ్ బయటకు ఎందుకు రావడం లేదని విపక్షాలు ఇటీవలి వరకు ఎన్నోసార్లు విమర్శించాయి. తాను మద్దతిస్తున్న బీజేపీ - టీడీపీలు తప్పు చేస్తే తాను నిలదీస్తానని పవన్ నాడు సార్వత్రిక ఎన్నికల సమయంలో చెప్పారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ఆయనను ఇటీవలి వరకు విమర్శించాయి.
అయితే, దానికి కూడా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవలి వరకు ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు పాలన పైన పవన్ సంతృప్తి వ్యక్తం చేశారని, అయితే, రాజధాని ఇష్యూ, బడ్జెట్‌లో లోటు పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆయనకు అన్యాయం జరిగిందని తెలియడంతోనే ఇప్పుడు బయటకు వచ్చారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications