'జగన్' ప్రశ్న: పవన్ కళ్యాణ్ తేల్చేశారా? గ్రేటర్ ఎన్నికల్లో
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం పవన్ రాజకీయ వేదికల పైన కనిపించలేదు. దీంతో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వంటివి.. ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీలను నిలదీస్తానని చెప్పిన పవన్.. ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్ బయటకు రాకపోవడాన్ని పదేపదే ప్రశ్నించింది. చంద్రబాబు నెలల పాలన పైనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, రుణమాఫీ పైన స్పష్టత ఇవ్వడం లేదని, ఇలాంటి సమయంలో నిలదీస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని పలుమార్లు ప్రశ్నించింది.
దీని పైన అప్పుడు జనసేన పార్టీ నుండి ఓ ప్రకటన కూడా వచ్చింది. పార్టీకి గుర్తింపు వచ్చాక, పవన్ వస్తారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. పవన్ బయటకు వస్తే చంద్రబాబు, మోడీల పైన విమర్శలు గుప్పిస్తారా? ఏం చెబుతారనే ప్రశ్న చాలామందిని తొలిచివేసింది.

అయితే, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ టీడీపీ-బీజేపీకి మద్దతుగానే ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు.
వారి ముందు చూపు వల్లనే నష్టం తగ్గిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గురువారం విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ వైపే ఉన్నారని అర్థమవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రశ్న కూడా అందరిని తొలచివేస్తోంది. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ఏం చేస్తుందనే అంశంపై చర్చ సాగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలోని అధికార తెరాస హైదరాబాదులోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు వల వేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఈ విషయాన్ని పవన్ స్వయంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు చెప్పారు. అదే సమయంలో తాను మద్దతిస్తున్న బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక.. తప్పు చేస్తే నిలదీస్తానని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరును చూస్తే ఆయన ప్రభుత్వాల పని తీరు పైన సంతృప్తిగానే కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications