కండిషన్స్ అప్లై: బిజెపితోను జగన్ సై, విభజనపై మెలిక
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికలకు లేదా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపితో దోస్తీకి సిద్ధమని జగన్ సంకేతాలు ఇచ్చారు.
ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజకీయాల్లో ఎవ్వరూ అంటరానివారు కాదని, మోడీతో సహా తమ ఆకాంక్షలు, డిమాండ్లను ఆమోదించే వారెవరితోనైనా చేతులు కలుపుతామని ప్రకటించారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజనను సమర్థించే పార్టీలతో తాము పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. సమైక్యాంధ్ర అనేది తమ పార్టీ డిమాండ్ మాత్రమే కాకుండా ప్రజల డిమాండ్ అన్నారు. ఈ రాష్ట్రాన్ని విభజించబోమని చెప్పే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో లేని సంప్రదాయాలకు తెరతీసిందని జగన్ విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం మూడు రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే వాటిని విభజించాలని నిర్ణయించుకుందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోసం వేచి చూడకుండానే, విభజన నిర్ణయం తీసుకుని, దానిని బలవంతంగా ప్రజల పైకి రుద్దుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తుల ప్రసక్తే లేదన్నారు.












Click it and Unblock the Notifications