ఐనా గెలవాలి: రంగంలోకి కేసీఆర్, మంత్రులపై భారం
హైదరాబాద్: పురపాలక, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల బాధ్యతను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించారు. అత్యధిక పుర, జెడ్పీ చైర్మన్లను గెలుచుకునేందుకు తెరాస కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలామంది సభ్యులు తెరాసలో చేరారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు.
ఎనిమిది జిల్లాల జిల్లా పరిషత్తు ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరుగనుండగా, ఈ ఎనిమిది జిల్లా పరిషత్తులను తెరాస కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. జిల్లా పరిషత్తు ఎన్నికలపై కేసిఆర్ ఆదివారం మధ్యాహ్నం తన అధికారిక నివాసంలో మంత్రులతో సమావేశం అయ్యారు. 11 మంది మంత్రులు ఉండగా, మంత్రులందరినీ ఎనిమిది జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా పంపించారు.

జిల్లా పరిషత్తు చైర్మన్ ఎన్నికలను మంత్రులు పర్యవేక్షిస్తే, విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని, స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు తెరాస పట్ల ఆసక్తి చూపిస్తారని నాయకత్వం భావిస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావడం వల్ల హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసు వల్ల ఖమ్మం జిల్లా పరిషత్తు చైర్మన్ పదవికి ఎన్నిక జరగలేదు. ఈ జిల్లాలో తెరాస అసలు పోటీయే చేయలేదు.
మిగిలిన ఎనిమిది జిల్లా పరిషత్తులను కైవసం చేసుకోవాలని తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చివరకు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించినప్పటికీ ఎలాగైనా ఆ జిల్లాను సైతం కైవసం చేసుకోవడానికి తెరాస నాయకత్వం ప్రయత్నిస్తోంది.
నల్గొండ జిల్లా పరిషత్తు చైర్మన్ ఎన్నిక బాధ్యతను జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు హైదరాబాద్‌కు చెందిన మంత్రి నాయిని నర్సింహా రెడ్డికి అప్పగించారు.
నల్గొండ జిల్లాలో 59 జెడ్పీటీసీలు ఉండగా, కాంగ్రెస్‌కు 43 స్థానాలు లభించాయి. తెరాసకు 13 స్థానాలు మాత్రమే దక్కాయి. సాధారణంగా అయితే ఈ జిల్లా పరిషత్తు ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ సునాయాసంగా కైవసం చేసుకోవాలి. కానీ ఇక్కడ కూడా తెరాస జెండా ఎగుర వేయడానికి ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది.
89లో మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అనుసరించడం ద్వారా నల్గొండ జిల్లా పరిషత్తును గెలిచి తీరుతామని తెరాస నాయకులు చెబుతున్నారు. 89లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 21 డిసిసిబిలను కైవసం చేసుకోగా అప్పుడు మెదక్ జిల్లా టిడిపి అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్థితో నామినేషన్ వేయించి గెలిపించారు.
అదే తరహాలో ఇప్పుడు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరి పేరు ఖరారు చేసినా, అతని వ్యతిరేక వర్గం వారిని గెలిపించడానికి తెరాస నాయకులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రమే తెరాసకు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఇతరుల మద్దతు అవసరం లేకుండా ఈ మూడు జిల్లా పరిషత్తులను కైవసం చేసుకుంటారు. అయితే మిగిలిన ఐదు జిల్లా పరిషత్తుల్లో సైతం తెరాస జెండా ఎగుర వేయడానికి ముఖ్యమంత్రి మంత్రులను రంగంలో దించారు.












Click it and Unblock the Notifications