పెళ్లి పేరుతో ఎన్నారైకి యువతి టోకరా: ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హైటెక్ సిటీలో ఓ మహిళ పెళ్లి సంబంధం పేరుతో ఏకంగా ఓ ఎన్నారైని మోసం చేసింది. దీంతో ఆ ఎన్నారై పోలీసులను ఆశ్రయించాడు. ఎన్నారై ఫిర్యాదుతో ఆ మహిళను, పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఆ మహిళ విషం తాగి ఆత్మహత్యాప్రయత్నం చేసింది. పోలీసులు మహిళను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఎన్నారైని మోసం చేసిన కేసులో మాళవిక అనే మహిళను శుక్రవారంనాడు పోలీసులు విచారించారు. అయితే పోలీసులు విచారిస్తుండగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

ఈ విషయాన్ని గమనించిన పోలీసులు మాళవికను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె విషం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా వెబ్‌సైట్లో వరుడు కావాలని ప్రకటనలు ఇస్తూ మాళవిక మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ ఎన్నారైని ఆమె మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెను విచారించడం ప్రారంభించారు
ఈ వ్యవహారంపై సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడారు. విచారణకు ముందే మాళవిక విషం తాగి సిసిఎస్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఆమె వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు ఆయన తెలిపారు. కాగా ఓ ఎన్నారైని మోసం చేసినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో మాళవికను విచారణకు పిలిచినట్లు డీసీపీ చెప్పారు.












Click it and Unblock the Notifications