వివాహేతర సంబంధం: మహిళ బట్టలు చించి, జుట్టు కత్తిరించారు..!
అమరావతి: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ మహిళ తన బంధువులు, స్నేహితుల సాయంతో మరో యువతిపై దాడికి పాల్పడి దుస్తులు చించి, జట్టు కత్తిరించిన సంఘటన వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. ఇంద్రాణి అనే మహిళ సుబ్బిరెడ్డి కొట్టాలలో నివాసం ఉంటోంది. ఆమెకు 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. పావని, గణేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్ధల కారణంగా నాలుగేళ్ల క్రితం ఆమె భర్తతో విడిపోయి జీవనం సాగిస్తుంది.
దీంతో ఆర్ట్స్ కాలేజి రోడ్డులో నివాసం ఉంటున్న గణేష్‌రెడ్డి అనే వ్యక్తి తనకు పెళ్లి కాలేదని చెప్పి మూడేళ్ల క్రితం ఇంద్రాణితో పరిచయం పెంచుకున్నాడు. ఏడాది కిందట ఈ విషయం అతని భార్య శ్రీదేవికి తెలియడంతో పలుమార్లు గొడవ పడింది. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది.

దీంతో తనతో మాట్లాడవద్దని, తనకు ఫోన్లు చేసి తనని ఇబ్బంది పెట్టవద్దని ఇంద్రాణి ఆరోజే గణేష్ రెడ్డికి తెగేసి చెప్పింది. అయినా సరే ఆమెకు మాయమాటలు చెప్పి మళ్లీ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో తన భర్తతో ఇంద్రాణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని శ్రీదేవి 20 మంది మహిళలను వెంటబెట్టుకుని ఇంద్రాణి ఇంటికి వెళ్లింది.
అందరూ కలిసి ఇంద్రాణి ఇంట్లో ఆమెపై గొడవకు దిగారు. ఇనుప సుత్తితో ఆమె తలపై కొట్టి గాయపరిచారు. ఆపై ఆమెను కొందరు పట్టుకోగా, మరికొందరు కత్తెరతో జుట్టు కత్తిరించారు. అంతటితో ఆగకుండా ఆమె వేసుకున్న దుస్తులను చింపేసి వెళ్లిపోయారు.
ఈ సమాచారం అందుకున్న బాధితురాలి సోదరుడు ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించాడు. అనంతరం శ్రీదేవితో పాటు మరి కొందరు మహిళలు తనపై దాడి చేశారని ఇంద్రాణి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బీరువాలో ఉన్న డబ్బుతో పాటు 2.5 తులాల బంగారం కనిపించలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
'మా ఇంటి వద్దకు రావద్దని అతనికి ఏడాది క్రితమే చెప్పాను. అయినా అతను వినిపించుకోవడం లేదు. వీళ్లు నన్ను చంపేస్తే నా పిల్లలు ఏం కావాలి. పిల్లల కోసమే బతుకుతున్నాను. నా బతుకేదో నన్ను బతకనివ్వండి. ఇంత మంది ఇంటి మీదికి వచ్చి రౌడీల్లా దాడి చేసి చంపేయబోయారు' అంటూ ఇంద్రాణి పోలీసుల వద్ద వాపోయింది.
దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications