జగన్‌కు జై కొట్టడమే శాపమా..? టీడీపీ , జనసేన ట్రోలింగ్‌కు బలైన యువతి
సోషల్ మీడియా వచ్చిన తరువాత విచ్చలవిడితనం పెరిగిపోయిందనే దానికి చాలా ఘటనలు ఉదాహరణలుగా నిలిచాయి. సోషల్ మీడియా ద్వారా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వేధింపులు తప్పడం లేదు. ఇక పొలిటికల్‌గా అయితే సోషల్ మీడియా హద్దులు దాటి ప్రవర్తిస్తుందనే చెప్పాలి. తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురైన ఓ అమాయకురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది. "నాకు ఇంటి పట్టా వచ్చింది. అమ్మ ఒడి అందుతోంది. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని" చెప్పడమే ఆమెకు శాపంగా మారింది.
ఏపీకి చెందిన గీతాంజలి అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో అని గీతాంజలి ఓ వీడియోలో వివరించింది. గీతాంజలిది పేద కుటుంబం. పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో ఆమె కుటుంబం ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేది. జగన్ ప్రభుత్వం ఆమెకు ఇంటి పట్టా అందించింది. ఇంటి పట్టా అందుకున్న తరువాత గీతాంజలి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గీతాంజలి మీడియాతో మాట్లాడింది.

తన ఇంటి కలను సీఎం జగన్ నిజం చేసిందని హర్షం వ్యక్తం చేసింది. ఈ వీడియోను అధికార వైసీపీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గీతాంజలి ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు గీతాంజలిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ దిగారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ అసభ్యపదజాలంతో గీతాంజలిని దుయ్యపట్టారు. టీడీపీ, జనసేన ట్రోలింగ్ తట్టుకోలేని గీతాంజలి రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
ఏంటి ఈవిడ చనిపోయిందా?
— MBYSJTrends ™ (@MBYSJTrends) March 11, 2024
జగన్ నాకు మంచిచేసాడు అని చెప్పటం ఈమె చేసిన తప్పా
trolls చేసి నిండు ప్రాణాన్ని తీసారు కదరా ఎటు వెళ్తున్నది రా సమాజం
పాపం రా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు
pic.twitter.com/LuJMMjHIgF
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించారు. రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొంది సోమవారం మృతి చెందింది. దీంతో సోషల్ మీడియాలో #justice For Geetanjali, #WeStandWithGeetanjali అనే యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆమెకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్‌కు జై కొట్టడమే గీతాంజలికి శాపంగా మారింది. సోషల్ మీడియాపై నిఘా లేకపోవడం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చనిపోయిన గీతాంజలి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. గీతాంజలి మరణం వల్ల ఆమె పిల్లలు అనాథలుగా మారారు.












Click it and Unblock the Notifications