ప్రపంచంలో అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఏదో తెలుసా?
డెన్మార్క్ : ప్రపంచంలో అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఏదో తెలుసా?.. 'డెన్మార్క్'. అవును ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జీవితం గడుపుతున్న ప్రజలు డెన్మార్క్ లోనే ఉన్నారని హాపీనెస్ లెవెల్స్ అనే ఓ అధ్యయన సంస్థ వెల్లడించింది. విశేషమేంటంటే.. గతేడాది మూడో స్థానంలో ఉన్న డెన్మార్క్ ఇప్పుడు ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుని.. అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
మొత్తంగా 156 దేశాల స్థూల జాతీయ ఉత్పత్తిలో ప్రజల సగటు ఆదాయాన్ని, దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితులను, జీవన స్థితి గతులను, స్వేచ్చ వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పరిశోధన నిర్వహించారు. మిగతా దేశాలతో పోల్చితే డెన్మార్క్ లోని ప్రజా జీవన విధానంలో సంతోషకర వాతావవరణముందని అధ్యయనం ద్వారా వెల్లడైంది. డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, ఫిన్‌లాండ్ దేశాలు నిలిచాయి.

వీటి తర్వాతి స్థానాల్లో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు నిలవగా.. అగ్రరాజ్యం అమెరికా 13వ స్థానంలో నిలవడం గమనార్హం. జర్మనీ 16, బ్రిటన్ 23 స్థానాల్లో నిలిచాయి. జాబితా వెలువడిన అనంతరం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రత్యేక సలహాదారు జెఫ్రీ సాచ్స్ దీనిపై స్పందించారు. ఆర్థిక సామర్థ్యం అధికంగా ఉన్న అమెరికా లాంటి దేశం హాపీనెస్ లెవల్స్ లో వెనకబడిందన్న సందేశాన్ని ఈ అధ్యయనం ద్వారా గమనించాలని ఆయన సూచించారు.
కేవలం ఆర్థికాభివృద్ధి నమూనాతోనే ముందుకెళ్తే.. మానవ సంక్షేమానికి విఘాతం కలుగుతుందని హాపీనెస్ లెవెల్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సామాజిక అంశాలతో పాటు పర్యావరణ విషయాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరముందని, లేకుంటే మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమధ్య కాలంలో హ్యాపీనెస్ లెవల్స్ కు ప్రాధాన్యం ఇస్తున్న దేశాల జాబితాలో.. తూర్పు యూరప్ దేశాలైన లాత్వియా, స్లొవేకియా, ఉజ్బెకిస్తాన్, రష్యా తో పాటు పలు దేశాలు చాలావరకు పురోగతి చెందాయని తెలియజేశారు.












Click it and Unblock the Notifications