విశ్వేశ్వర రెడ్డి సవాల్ : టీడీపీలో అంత దమ్మున్న లీడర్ ఎవరు..?
అనంతపురం : వీడే వాళ్లు పార్టీని వీడుతున్నారు. పార్టీలో ఉన్నవాళ్లు అధికార పక్షం ఆకర్ష్ మంత్రాన్ని నిలువరించేందుకు మాటల తూటాలు సంధిస్తున్నారు. అయితే చిత్రంగా.. గతంలోను ఇలా టీడీపీని టార్గెట్ చేసినవాళ్లు ఇప్పుడు అదే పార్టీ కండువాలు కప్పుకుని దర్శనమిస్తుండడం గమనార్హం. దీంతో నేతల మాటలపై నమ్మకం లేని పరిస్థితి. కానీ, ఈ విషయంలో తాను మాత్రం టీడీపీ లొంగేది లేదని తేల్చి చెప్తున్నారు అనంతపురం ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి.

జల జాగరణ దీక్షలో భాగంగా బెళుగుప్పలో ఆయన చేపట్టిన దీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు విశ్వేశ్వర రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనను పార్టీలో చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ శతవిధాల ప్రయత్నిస్తోందని, కానీ తాను ప్రలోభాలకు లొంగే రకం కాదని చెప్పారు. అంతేకాదు, తనను కొనుగోలు చేసేంత దమ్ము, ధైర్మమున్న నేత తెలుగుదేశంలో ఎవరున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి జగన్ నమ్మిన బంటుగాను పేరున్న విషయం తెలిసిందే.
ప్రలోభాలకు లొంగే రకం కాదు కాబట్టే.. పార్టీ మారుతున్నానని కట్టు కథలు సృష్టించి టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. తనను పార్టీ మారమని చెప్పేంత దమ్ము ఏ నేతకు లేదని స్పష్టం చేసిన ఆయన, వైసీపీలో తామంతా ఒక తల్లి బిడ్డల్లాగా కలిసి ఉంటామని, పార్టీ మారేది లేదని తెగేసి చెప్పారు.












Click it and Unblock the Notifications