నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: చంద్రబాబుకు ఎంపీ మార్గాని భరత్ సవాల్!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో ఒక ఎంపీ ఉన్నాడు. పార్లమెంటులో మాట్లాడలేడు కానీ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తాడు అంటూ టార్గెట్ చేసిన చంద్రబాబు అలాగని ఆయన పిచ్చోడు అనుకోడానికి వీల్లేదన్నారు.
నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా మార్గాని భరత్ కు 15 శాతం కమిషన్ ఇవ్వాలని విమర్శలు గుప్పించారు. ఆవ భూముల స్కాం లో ఇతని వాటా రూ.150 కోట్లు అని ప్రజలే చెబుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు.

స్కీముల పేరుతో స్కాములు చేసి జైలు పాలైన చంద్రబాబు తనని ఎలా విమర్శిస్తారు అంటూ ప్రశ్నించారు. తాను నిజాయితీగా రాజకీయంగా సేవ చేయడానికి వచ్చానని పేర్కొన్న మార్గాని భరత్ తన సొంత ఆస్తులు అమ్ముకొని, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించడం కోసం కష్టపడుతున్నాను అన్నారు. టిడిపి నాయకుల లాగా తాను రాజకీయాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించడం లేదని మండిపడ్డారు.
వడ్డీ వ్యాపారాలు, చీట్ల వ్యాపారాలు చేయడం లేదని, అడ్డమైన దందాలు చేసి సెంట్రల్ జైలుకు వెళ్లి రాలేదని విమర్శించారు. దొంగలను పక్కన పెట్టుకుని చంద్రబాబు తనను విమర్శించడం దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని మార్గాని భరత్ పేర్కొన్నారు. ఆవ భూముల్లో తనకు 150 కోట్ల రూపాయలు ఎవరిచ్చారు? చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను ఎవరి వద్దనైనా కమిషన్ తీసుకున్నానని చంద్రబాబు నిరూపించాలన్నారు.
రాజమండ్రిలో తాను చేసిన అభివృద్ధి 15 ఏళ్ల టిడిపి పాలనలో జరిగిందని కంటే ఎక్కువ అని మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. ఎవరినైనా విమర్శించే ముందు ఆలోచించి విమర్శలు చేయాలని హితవు పలికారు. చంద్రబాబు చెబుతున్న మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు జన్మభూమి కమిటీలకు కార్యకర్తలకే తప్ప ఇతరులకు ఎవరికీ రావని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 80 లక్షల మహిళలకు ఏటా మూడు సిలిండర్లు చంద్రబాబు ఇవ్వగలరా అంటూ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications