ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే అన్న క్యాంటీన్‌లు తెరవండి.. పథకాలకు పేర్లు పెట్టండి: రఘురామకృష్ణం రాజు
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు . అందరిని బికారులను చేస్తున్నారని విమర్శించారు. పైకి అన్ని స్కీములు.. లోపల అన్ని స్కాములు అని ఆరోపించారు. కొత్త జిల్లా పేరుతో ప్రజల్లో అశాంతిని తీసుకువచ్చారని మండిడ్డారు. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాన్ని రాత్రికి రాత్రి దొంగ చాటుగా నోటిఫికేషన్ జారీ చేశారని సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. రాచరిక పాలన కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఎన్టీఆర్ స్థాయిని తగ్గించారు,
వైసీపీ ప్రభుత్వానికి ఎన్టీఆర్‌పై ప్రేమ అనేది పచ్చి అబద్ధమన్నారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. నిజంగా ప్రేమ ఉంటే అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్‌లు ఎందుకు మూసేశారని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వాటి తెరవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అమ్మ క్యాంటీన్‌ను కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన స్థాయిని తగ్గించారన్నారు . విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టినంత మాత్రానా ఆ సామాజికవర్గం ఓట్లు వస్తాయనుకోవడం పొరపాటు అన్నారు. ప్రతి పథకానికి జగనన్న, వైఎస్ఆర్ పేరు పెట్టే బదులుగా.. ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టవచ్చు కదా అని నిలదీశారు.

.మంత్రులు కాళ్లు కట్టేసి, ఎమ్మెల్యేల నోళ్లు కుట్టేసి..
జిల్లాల విభజనపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉందన్నారు రఘురామకృష్ణం రాజు. కానీ ఏక పక్షంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడకుండా మంత్రులు కాళ్లు కట్టేసి, ఎమ్మెల్యేల నోళ్లు కుట్టేశారని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారని తెలిపారు. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల ఆందోళనను పక్కదోవ పట్టించేందుకు కొత్త జిల్లాలను తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు.

ఉద్యోగులతో చర్చించాల్సిన బుగ్గన జాడలేదు..
ఉద్యోగులతో చర్చలు జరపడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు రఘురామకృష్ణంరాజు. ఉద్యోగులను విభజించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగులతో సంప్రదింపులు జరపాల్సిన ఆర్థిక మంత్రి బుగ్గన జాడ లేదని విమర్శించారు. గత టీడీపీ పాలనలో సలహాదారులు మీడియాతో మాట్లాడడాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం తెలిపారని గుర్తు చేశారు.

ఉద్యోగులలో అశాంతి లేపుతున్నారు..
ఉద్యోగులు న్యాయబద్ధంగా వారికి రావాల్సిన వాటి మాత్రమే అడుగుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. కావాలని వారిలో అశాంతిని లేపుతున్నారని విమర్శించారు. ఏ అర్హత లేని సలహాదారుడికి ఉద్యోగులను బెదిరించే హక్కు లేదని దుయ్యబట్టారు. నేను ఉన్నాను, నేను వింటాను అన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. సజ్జల ఉన్నాడు, సజ్జల వింటాడు, సజ్జల చేస్తాడు అని ఏ రోజు చెప్పలేదని రఘురామకృష్ణం రాజు చురకులు అంటించారు. ప్రజల సమస్యలన పట్టించుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు












Click it and Unblock the Notifications