యమపాశమైన చున్నీ.. పెళ్లైన తొమ్మిది నెలలకే తిరిగి రాని లోకాలకు !
కొత్తగా వివాహ బంధం లోకి అడుగుపెట్టిన ఓ యువతికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. భర్తకు ఉద్యోగం కూడా రావడంతో కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కన్న ఆ యువతికి.. ఆమె చున్నీయే యమపాశంగా మారింది. అనుకోని ఈ సంఘటనతో పల్లి జరిగిన తొమ్మిది నెలలకే యువతి మృతి చెందడం సర్వత్రా విషాదాన్ని నింపుతోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన రామదుర్గ (28)కు.. కోనసీమ జిల్లా పోలవరంకు చెందిన మోహన్ కృష్ణతో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. మోహన్ కృష్ణకు అచ్యుతాపురం సెజ్‌లో.. ఇటీవల ఉద్యోగం రావడంతో వారు పోలవరం నుంచి ఇక్కడికి వచ్చేశారు. సెజ్ కి సమీప ప్రాంతంలోనే ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. అయితే రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటంతో.. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఆమెను తీసుకుని.. మోహన్ ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి బయలుదేరారు.

వారిద్దరూ బైక్ పై హరిపాలెం ప్రాంతానికి వచ్చిన సమయంలో రామదుర్గ వేసుకున్న చున్నీ బైక్ వెనక చక్రంలో పడి మెడకు బిగుసుకుపోయింది. స్థానికులు గమనించేటప్పటికే ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. వారు వెంటనే చున్నీని కత్తిరించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లైన 9 నెలలకే యువతికి నూరేళ్లు నిండాయా ఆమె తల్లిదండ్రులు రోదిస్తున్నారు. సంబంధిత ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ దుర్ఘటనతో మహిళలు ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరిస్తున్నారు. చున్నీలు. చీర కొంగులు జాగ్రత్తగా వేసుకోవాలని లేకుంటే ప్రాణానికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications