"పులివెందులలో గూండాలు దిగారు.. అభివృద్ధిని చూసి ఓటెయ్యండి"
పులివెందుల మున్సిపాల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, అధికార బలంతో అడ్డదారిలో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్ర కుట్రలు పన్నుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పులివెందుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎంఓ, డీజీపీ కార్యాలయాల నుంచి వస్తున్న ప్రత్యక్ష ఆదేశాలతో స్థానిక పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డీఐజీ కోయ ప్రవీణ్ కనుసన్నల్లోనే ఈ ఎన్నికల అరాచకాలు సాగుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నామినేషన్ల నుంచే మొదలైన దౌర్జన్యాలు..
పులివెందులలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచే అక్రమాలు శృతిమించాయని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిల నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసులే స్వయంగా అడ్డుకున్నారని ఆరోపించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు రావాలని చెప్పిన పోలీసులే తీరా అక్కడికి వెళ్తే అడ్డుకున్నారని, తమ కౌన్సిలర్ అభ్యర్థులను, చివరికి మహిళలను కూడా లోపలికి అనుమతించలేదని తెలిపారు. లాఠీఛార్జ్, బాష్పవాయువు, పొగ బాంబులు ప్రయోగించి ఏకంగా 37 రౌండ్ల కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించారని, రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాజ్యాంగ హక్కులను కాలరాశారని విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు - పోలీసుల నిమ్మకు నీరెత్తిన వైఖరి
ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు చెందిన ఇళ్లు, వాహనాలు, షాపులను పెట్రోల్ పోసి తగులబెడుతున్నారని.. దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లభించినా పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, రివర్స్‌లో వారిపైనే సెక్షన్ 307 కింద కేసులు బనాయించి అర్ధరాత్రి ఇళ్లలో సోదాలు చేస్తూ అరెస్టులు, రిమాండ్లతో వేధిస్తున్నారని మండిపడ్డారు.
బయటి ప్రాంతాల నుంచి గూండాల తరలింపు - హైకోర్టులో పిటిషన్
గతంలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల తరహాలోనే ఇక్కడ మళ్లీ దొంగ ఓట్లు వేయించడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, రాయచోటి తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది గూండాలను పులివెందులకు రప్పించి, వారికి పోలీసులే లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లలో వసతి కల్పిస్తున్నారని చెప్పారు. ఈ అరాచకాలపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో పూర్తిస్థాయి వెబ్ కాస్టింగ్, లైవ్ ఫుటేజ్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.
అభివృద్ధి వర్సెస్ అక్రమ దోపిడీ..
వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల హయాంలో కృష్ణా జలాలు తీసుకువచ్చి ప్రశాంతంగా ఉన్న పులివెందులలో చంద్రబాబు మళ్లీ కక్షలకు ఆజ్యం పోస్తున్నారని అవినాష్ రెడ్డి దుయ్యబట్టారు. రూ. 500 కోట్లతో కట్టిన మెడికల్ కాలేజీ సీట్లను వద్దని కోరడం, రూ. 25 కోట్లతో నిర్మించిన కోల్డ్ స్టోరేజ్‌ను పక్కన పడేయడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మరోవైపు బీటెక్ రవి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్ మైనింగ్, ఇసుకను బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి, పులివెందుల మున్సిపాలిటీని అరాచకశక్తుల చేతుల్లో పెట్టకుండా వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి ప్రమీలమ్మతో పాటు 20 వార్డుల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.














Click it and Unblock the Notifications
