జగన్ బిగ్ యాక్షన్ ప్లాన్- 4న జిల్లా పర్యటన..
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌పరం చేయబోతోండటం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులతో గతంలో కీలక సమావేశాలను నిర్వహించిన ఆయన క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వ పాలనపై పలు అంశాలపై కార్యాచరణను ప్రకటించారు. మెడికల్ కాలేజీల అంశంపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సహా వివిధ రూపాల్లో ఆ పార్టీ ముందుకెళ్తోంది.

ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ తాజాగా మరో జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెడన నియోజకవర్గం పరిధిలో గల గూడురుకు వెళ్లనున్నారు. మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలించనున్నారు. రైతులను పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా పలువురు నాయకులు పాల్గొననున్నారు.
మొంథా తుఫాన్ వల్ల రూ.5,244 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నివేదికను కేంద్రానికి అందజేసింది. వివరాలు వస్తే నష్టం అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఒక్క వ్యవసాయ రంగానికి సంబంధించి 1.38 లక్షల హెక్టార్లలో 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. దీనివల్ల రూ.829 కోట్ల వరకు రైతులు నష్టపోయారు.
మొత్తం 1.74 లక్షల మంది రైతులపై తుఫాన్ ప్రభావం చూపించింది. 12,215 హెక్టార్లలోని రూ.40 కోట్ల విలువైన ఉద్యానపంటలు దెబ్బతినగా 23,979 మంది ఉద్యాన రైతులకు నష్టం జరిగింది. ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. మరోవైపు 2,261 పశు సంపదను నష్టపోయారు. 4,794 కిలో మీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారులు, 311 కల్వర్టులు-బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. ఈ నష్టం రూ.2,774 కోట్ల మేర ఉందని వివరించారు.












Click it and Unblock the Notifications