YS Jagan Tour: జమిలి అంటున్నారు-ఇలా చేస్తే కానీ.. జగన్ కామెంట్స్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలైన సందర్భంగా ప్రభుత్వ తప్పిదాలను, ఎన్నికల హామీలు విస్మరించడాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత జిల్లాల్లో టూర్ ప్రారంభిస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో జరిగిన భేటీలో జగన్ ఈ టూర్ పై మరిన్ని వివరాలు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయిందని, ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చిందని వైసీపీ నేతలకు జగన్ తెలిపారు. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయిందని, జమిలి అంటున్నారని. అందరం చురుగ్గా ప్రజల తరపున పనిచేయాలని జగన్ వారికి సూచించారు. ప్రజల తరపున గళం వినిపించాలని కోరారు. ప్రతిఒక్కరూ ప్రజలకేం కావాలి, వారికి తోడుగా అండగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలని జగన్ కోరారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. తన జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుందని జగన్ తెలిపారు. అక్కడే నిద్ర చేస్తానని వెల్లడించారు. ప్రతి బుధవారం, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటానన్నారు. కార్యకర్తలతో మమేకం అవుతానని, కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అన్న పేరుతో ఈ కార్యక్రమం చేస్తానన్నారు.
పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలని, ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ, నియోజకవర్గంలో వైయస్సార్సీపీ బలంగా ఉందని జగన్ తెలిపారు. దీన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. తన పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలని వారికి సూచించారు. తన కార్యక్రమం మొదలైనప్పుడు
గ్రామ స్థాయి, బూత్ కమిటీల వరకు నియామకాలు పూర్తి చేద్దామన్నారు.
ఈ కమిటీల పూర్తైన తర్వాత ప్రతి సభ్యుడికీ సోషల్ మీడియా మాధ్యమంలో ఉండే ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ అన్ని అకౌంట్లు ఉండాలన్నారు. మన గ్రామంలో ఏం జరుగుతున్నా అన్యాయాన్ని ప్రశ్నించాలన్నారు. ఆసుపత్రిలో డాక్టర్ ఎందుకు లేడని, పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని, అమ్మఒడి ఏమైందని.. ఇలా ప్రతిదీ ఫోటో తీసి అప్ లోడ్ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications