స్థానిక ఎన్నికల్లో జగన్ దూకుడు - తొలి మేయర్ అభ్యర్ధి ప్రకటన..!!
స్థానిక ఎన్నికల వేళ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుప్రీంలో బీసీ రిజర్వేషన్ల అంశం పై నిర్ణయం తరువాత ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వరుసగా పలువురు పార్టీ నేతలతో జిల్లాల వారీగా జగన్ సమీక్షలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పై కసరత్తు కొనసాగిస్తున్నారు. పార్టీ నేతలతో ఒన్ టు ఒన్ సమావేశాలు నిర్వహిస్తూ.. సూచనలు అందిస్తున్నారు. కాగా.. తొలి మేయర్ అభ్యర్ధిని జగన్ ఖరారు చేసారు.
స్థానిక ఎన్నికల పై జగన్ దూకుడు పెంచారు. ఈ ఎన్నికలను కూటమి- వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాల వారీగా జగన్ స్థానిక ఎన్నికల పైన పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమికి ధీటుగా ఎన్నికల్లో పని చేయాలని నిర్దేశించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ లే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసారు. అభ్యర్ధుల ఎంపిక.. సామాజిక సమీకరణాలు.. స్థానికంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష పద్దతిలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు జరగనుండటంతో అనుకూలంగా మలచుకోవాలని సూచిస్తున్నారు. మేయర్ సీటు బరి లో బలమైన అభ్యర్ధిని దింపటం ద్వారా ఎన్నికలో లెక్కలు మారుతాయని.. పార్టీ కోసం పని చేసిన వారికే సీట్లు ఇవ్వాలని జగన్ స్పష్టం చేసారు. స్థానికంగా అందరూ ఏకాభిప్రాయంతోనే అభ్యర్ధిని ఫిక్స్ చేయాలని జగన్ నిర్దేశించారు.

నెల్లూరు మేయర్ అభ్యర్ది ప్రకటన
కాగా.. మేయర్, మున్సిపల్ ఛైర్మన్లుగా అభ్యర్ధుల ఖరారు పైనా జగన్ పార్టీ నేతలతో చర్చలు చేస్తు న్నారు. రిజర్వేషన్ల ఖరారు తరువాత సీటు ఎవరికి వచ్చినా... అన్ని వర్గాల నుంచి అభ్యర్ధుల పేర్ల తో జాబితాలు సేకరిస్తున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్ధిని ఖరారు చేయనున్నారు. ఈ కసరత్తులో ఇంఛార్జ్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాంతీయ సమన్వయ కర్తలకు కీలక బాధ్యత లను అప్పగించారు. కాగా.. ఈ ఎన్నికల్లో తొలి అభ్యర్ధిని ప్రకటించారు. నెల్లూరు మేయర్ అభ్యర్ధి గా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని జగన్ ఖరారు చేసారు. ఆయన గతంలో వైసీపీలో కీలకంగా పని చేసారు. నెల్లూరు ఆనం కుటుంబానికి ఉన్న ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకొని .. నగర పరిధిలోని నేతలతో చర్చల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా కార్పోరేటర్ అభ్యర్దు లను ఖరారు చేయనున్నారు. దీంతో... మిగిలిన కార్పోరేషన్లు, మున్సిపాల్టీల విషయంలోనూ జగన్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని.. రిజర్వేషన్ల ఆధారంగా జాబితా ప్రకటించేందుకు కార్యాచరణ సిద్దం చేసారని సమాచారం.













Click it and Unblock the Notifications
