వైసీపీ లిస్ట్ వేళ అసంతృప్తులకు జగన్ బుజ్జగింపులు ! రోజా, అంబటి, గోపిరెడ్డి సీట్లపై ఉత్కంఠ.. !
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ, ఎంపీ అభ్యర్ధుల తుది జాబితా విడుదల చేసేందుకు సీఎం జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 అసెంబ్లీ సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చేసిన జగన్.. వారికి ఇతర చోట్ల సీట్లు కేటాయించడమో లేక కొత్త వారికి అవకాశం ఇవ్వడమో చేసేశారు. అలాగే పలు ఎంపీ సీట్లకూ కొత్త అభ్యర్ధులు వచ్చేశారు. వీరితో పాటు మరికొన్ని మార్పులు చేర్పులు చేసి మార్చి 16న ఇడుపులపాయలో తుది జాబితా విడుదలకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు.
ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఇంకా చేయాల్సిన మార్పులు, అసంతృప్తులను బుజ్జగించే పనిలో సీఎం జగన్ ఉన్నారు. ఇందులో భాగంగా మంత్రులు అంబటి రాంబాబు (సత్తెనపల్లి), ఆర్కే రోజా (నగరి), ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నరసరావుపేట) వంటి వారిని జగన్ క్యాంప్ ఆఫీసుకు పిలిపించారు. వీరితో పాటు వీరి నియోజకవర్గాల్లో అసంతృప్త నేతల్ని కూడా పిలిపించి వీరి సమక్షంలోనే మాట్లాడుతున్నారు. ఈ చర్చల్లో అసంతృప్తులు ఒప్పుకుంటే సరి లేకపోతే వీరి సీట్లనూ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే సమయంలో మరికొన్ని సీట్లలో నేతలు కూడా ఇవాళ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వీరిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మంత్రి దాడిశెట్టి రాజా, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ వంటి వారు ఉన్నారు. వీరి సీట్లలో తాజా పరిస్దితులు, అసంతృప్తులు, ఇతర వ్యవహారాలపై జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు నేతల్ని కూడా చర్చలకు పిలిచినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు పూర్తయితే వైసీపీ తుది జాబితా సిద్దమవుతుంది.












Click it and Unblock the Notifications