జగన్ దేవుడ్నీ ప్రజలనే నమ్ముకున్నారా, ఎమ్మెల్యేలను కాదా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలనూ దేవుడ్ని మాత్రమే నమ్మినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేసే సమయంలో ఆయన ప్రతీసారీ పైన దేవుడున్నాడు, ప్రజలున్నారని అనడం ఆయనకు అలవాటుగా మారింది.
దేవుడే బుద్ధి చెప్తాడని కూడా ఆయన అంటుంటారు. శానససభ్యులు ఒక్కరొక్కరే ఆయన నుంచి జారిపోతుంటే ఆయన వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. జగన్ తన చుట్టూ ఉన్నవారిని నమ్మబోరని, ప్రత్యర్థులు విమర్శలు చేస్తే నవ్వుతారని, పార్టీకి చెందినవారు ఏదైనా అంటే సీరియస్‌గా తీసుకుంటారని తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్న జ్యోతుల నెహ్రూ ఒకానొక సందర్భంలో అన్నారు.
దాన్ని బట్టి సొంత శాసనసభ్యులను జగన్ విశ్వసించబోరని అనిపిస్తూ ఉంటుంది. సొంత పార్టీ నాయకులు గానీ శాసనసభ్యులు గానీ ఏమైనా చెప్తే ఆయన వినరని కూడా చెప్తారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని వారు అనుసరించాల్సిందే తప్ప మరో మాటకు తావు లేదని అంటుంటారు.

పార్టీ పెట్టినప్పుడు తాను, అమ్మ మాత్రమే ఉన్నారని జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఫరాయిస్తున్న వైనంపై వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు మాత్రం ఆయన తీవ్రంగా కలత చెందినట్లు కనిపించారు. తన కుటుంబంలోని సభ్యుల్లా వారిని చూసుకున్నానని ఆయన అన్నారు. శోభమ్మ మరణిస్తే తన కుటుంబమంతా వెళ్లిందని కూడా అన్నారు.
ఇప్పటి వరకు దాదాపు పది మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. జ్యోతుల నెహ్రూ ఇది వరకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా టిడిపిలో చేరబోతున్నారు. పార్టీ మారడానికి వారంతా జగన్ వ్యవహార శైలిని మాత్రమే తప్పు పడుతున్నారు.

అధికార పార్టీలోకి ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, శాసనసభ్యులు ఫిరాయించడం పరిపాటే. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి పెద్ద యెత్తున ఫిరాయించారు. అయితే, తెలంగాణలో దాదాపుగా టిడిపి తుడిచిపెట్టుకుపోయిందనే వాదన వినిపిస్తోంది.
పది మంది శాసనసభ్యుల దాకా ఫిరాయించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు నుంచి 67 మంది శాసనసభ్యులు గెలిచారు. పది మంది ఫిరాయంచిన తర్వాత కూడా 56 మంది ఎమ్మెల్యేలున్నారు. ఏమైనా, దేవుడిపై, ప్రజలపై జగన్ వేసిన భారం వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గట్టెక్కిస్తుందా, చూడాలి.












Click it and Unblock the Notifications