స్థానిక ఎన్నికల పై జగన్ బిగ్ డెసిషన్- ముఖ్య నేతలకు పిలుపు..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కూటమి నేతలు ఇప్పటికే సమన్వయం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటీ పైన కొత్త ఫార్ములా సిద్దం చేస్తున్నారు. తాము బలం ఉన్న చోట పోటీ చేస్తామని జనసేన నేత మనోహర్ ప్రకటించారు. ఇటు మాజీ సీఎం జగన్ సైతం ఈ సారి స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. మారుతున్న సమీకరణాల వేళ ఈ ఎన్నిక ల్లో కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలకు బిగ్ టాస్క్ అప్పగించారు.
ఏపీలో స్థానిక సమరానికి సర్వం సిద్దం అవుతోంది. సెప్టెంబర్ చివరి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందుగా మున్సిపల్ ఆ తరువాత పంచాయితీ ఎన్నికలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అటు కూటమి ఈ ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది. దీంతో, మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు ఈ ఎన్నికల పైన కీలక దిశా నిర్దేశం చేసారు. తన వైఖరి ఏంటో స్పష్టం చేసారు. వార్డు నుంచి మండలం వరకు ఏ ఎన్నిక అయినా పార్టీ అభ్యర్ధి పోటీలో ఉండాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. ఎక్కడైనా పార్టీ అభ్యర్ధి పోటీలో లేకపోతే సంబంధిత నియోజకవర్గ ఇంఛార్జ్ ను బాధ్యులను చేస్తూ కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కోసం పని చేసిన వారికి స్థానికంగా సీట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసారు. ఈ ఎన్నికల పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ ఈ నెల 22న కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

స్థానిక ఎన్నికల పై దిశా నిర్దేశం
కాగా, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు స్థానిక ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. మూడు పార్టీల కూటమిలో స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలకు అనుగుణంగా స్థానిక పరిస్థితులకు తగిన విధంగా నిర్ణయాలు ఉండాలని జగన్ తాజా సమావేశంలో స్పష్టం చేసారు. అదే విధంగా జగన్ 2.0 యాప్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ.. కార్యకర్తలకు అందు బాటులో ఉండాలని నిర్దేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించాలని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి అండగా నిలిచేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించాలని స్పష్టం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ను సంబంధిత నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కేటాయింపు వేళ కీలకం అవుతుందని చెప్పటం ద్వారా లోకల్ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో.. పార్టీ కీలక నేతలతో జరిగే సమావేశంలో ఈ ఎన్నికల పైన జగన్ మరింత పక్కాగా దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications