పార్టీ కార్యకర్తల కోసం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని జగన్ ఆరోపించారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయని, అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని జగన్ అన్నారు.
అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా వెల్లడించారు జగన్. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్‌ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్‌తో దాడిచేయించారని అన్నారు. ఓ పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిదని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన తమ పార్టీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారని, లంచం ఇవ్వలేదని లేని గంజాయి కేసుపెట్టి రెండు నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారంపై గళమెత్తుతున్న కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన తమ పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌నాయుడును టీడీపీ కార్యకర్తలు హత్య చేశారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా?, అలా చేస్తే చంపేస్తారా? అని జగన్ ప్రశ్నించారు. పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారని అన్నారు.
నిందితులకు అధికారపార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక తండ్రిలేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయిందని, ఈ విషయంలో పోలీసులది ప్రేక్షక పాత్రే అయిందని చెప్పారు. ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదని చెప్పారు.
రెడ్‌బుక్ రాజ్యాంగానికి సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ అనే తమ పార్టీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులు అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తీవ్ర వేధింపులకు దిగారని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైయస్సార్‌సీపీలో ఎందుకున్నావు అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారని విమర్శించారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీపై ఆయన వీడియో వాంగ్మూలం ఇచ్చాడని, బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడని జగన్ చెప్పారు. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications