పవన్ కళ్యాణ్ మొన్న అలా, నిన్న ఇలా, రేపు ఎలానో: జగన్ వ్యంగ్యం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి రైతుల భూములను ప్రభుత్వం సేకరించే విధానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. పవన్ కళ్యాణ్ మాట మార్చారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెబుతున్నారో ప్రజలని అడగాలని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ మొన్న ఏం చెప్పారు, నిన్న ఏం చెప్పారు, రేపు ఏం చెబుతారో తెలియదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశంచి గవర్నర్ చేసిన ప్రసంగంపై ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగం అంతా అర్థ సత్యాలు, పూర్తి అబద్ధాలతో నిండి ఉందని ఆయన విమర్శించారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారనేది అర్థ సత్యమో లేదా అబద్ధమో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని భూముల్లో 3 నుంచి 4 పంటలు పడుతున్నాయని చెప్పారు.

రాజధాని ప్రాంతంలో పిల్లలు కార్పోరేట్ పాఠశాలల్లో చదుపుతున్నారని చెప్పారు. మంత్రి నారాయణ తన కాలేజీల్లో ఫీజులు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైతే పిల్లల తల్లిదండ్రులకు పాతిక సార్లు ఫోన్ చేసి అడుగుతున్నారని ఆయన చెప్పారు. ఆధర్మం ఎప్పుడూ ఓడిపోతుందని ఆయన అన్నారు. మానవత్వంతో తమ పార్టీ రైతులకు అండగా నిలిచిందని ఆయన అన్నారు.
రూ.20 వేల కోట్లకు పైగా నిధులకు సంబంధించిన జీవో 22 గురించి ఎవరూ మాట్లాడడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేయకుండా నిలిపేసిన జీవోను అమలు చేయడం అవినీతి కాదా అని అడిగారు. పట్టిసీమకు 22 శాతం అధికంగా టెండర్లు కాంట్రాక్టర్లకు ఇవ్వడం అవినీతి కాదా అని ప్రశ్నించారు.
బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం నిరాశపరిస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రులను కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని జగన్ ప్రశ్నించారు. బిజెపికి చెందిన వారిని రాష్ట్ర మంత్రి వర్గంలో ఎందుకు పెట్టుకున్నారని అన్నారు. ఓ సన్నాయి నొక్కులు, డ్రామాలు ఎవరిని మోసం చేయడానికి అంటూ ఆయన నిలదీశారు.
నరేంద్ర మోదీ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్న జగన్ ఎన్డీఏలో టీడీపీ ఎందుకు కొనసాగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్రానికి చంద్రబాబు తన మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన వైఎస్‌పై పవన్ చేసిన ఆరోపణలు విచారకరమని, పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications