స్థానిక ఎన్నికల వేళ జగన్ బిగ్ స్కెచ్ - టార్గెట్ ఫిక్స్..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం కూటమి పార్టీలు సమన్వయం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు ఇప్పటికే ఈ ఎన్నికలపై కీలక దిశా నిర్దేశం చేసారు. కాగా... జగన్ తాజాగా పార్టీ పరంగా అమలు చేయాల్సిన కొత్త కార్యాచరణ పైన తుది కసరత్తు చేస్తున్నారు.
రాజకీయంగా జగన్ కొత్త నిర్ణయాలను అమలు చేస్తున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. వార్డు నుంచి మండలం వరకు ఏ ఎన్నిక అయినా పార్టీ అభ్యర్ధి పోటీలో ఉండాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. ఎక్కడైనా పార్టీ అభ్యర్ధి పోటీలో లేకపోతే సంబంధిత నియోజకవర్గ ఇంఛార్జ్ ను బాధ్యులను చేస్తూ కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కోసం పని చేసిన వారికి స్థానికంగా సీట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసారు.

ఈ ఎన్నికల పైన పార్టీ ముఖ్య నేతలతో వచ్చే వారం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇందు కోసం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు స్థానిక ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. మూడు పార్టీల కూటమిలో స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలకు అనుగుణంగా స్థానిక పరిస్థితులకు తగిన విధంగా నిర్ణయాలు ఉండాలని జగన్ తాజా సమావేశంలో స్పష్టం చేసారు.
కాగా, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొత్త ప్రణాళికలను అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాల పైన పార్టీ నేతలతో పాటుగా స్వచ్చంద సంస్థల ప్రతినిధు లతో సమావేశాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు దిశగా పార్టీ నేతలకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన చర్చా వేదికలు.. అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది.
ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు ల నిర్వహణ దిశగా కసరత్తు చేస్తోంది. అర్బన్ ఏరియాల్లో వీటిని ఎక్కువగా నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు. స్థానిక ఎన్నికలకు ముందే ఈ కార్యాచరణ అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రతీ వారం ఒక జిల్లాలో పర్యటన చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం కార్యాచరణ పైన వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications