బాబుకు ఇంత డబ్బెక్కడిది, 13మంది పోతే ఏంకాదు: జగన్, ఇదీ అవినీతి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, చంద్రబాబుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మంగళవారం ప్రశ్నించారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

కొంతమందికి మంత్రి పదవులు ఇస్తామని చెబుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుంచి రూ.30 కోట్లు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు.

తమకు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తమ పార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. ప్రజల గుండెల్లో స్థానం, పైన దేవుడు తమకు ఉన్నాడని చెప్పారు. తెలంగాణలో ఓటుకు నోటు ద్వారా కొనుగోలు ప్రారంభించిన చంద్రబాబు ఏపీలోను కొంటున్నారన్నారు.

YS Jagan

ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లడబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే అడిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు కూటమికి, మా కూటమికి మధ్య ఓట్ల తేడా ఒక శాతం కంటే కొంత ఎక్కువ మాత్రమే ఉందన్నారు. మాకు వచ్చిన ఓట్ల కంటే ఆ కూటమికి వచ్చిన ఓట్లకు పెద్దగా తేడా లేదన్నారు.

ఓ పార్టీ నుంచి గెలిచిన (వైసిపి) ఎమ్మెల్యేలతో మంత్రులుగా ఎలా ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రశ్నించారు. ఒక గుర్తు పైన గెలిచిన ఎమ్మెల్యేలు పదవులు మారాక మరో పార్టీలో ఆ పదవిలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. గతంలో మాకు 45 శాతం ఓట్లు వస్తే, చంద్రబాబు కూటమికి 46 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు.

చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. డ్వాక్రా మహిళలను, రైతులను, నిరుద్యోగులను.. ఇలా అందర్నీ చంద్రబాబు మోసగించారన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటూ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు.

జాబు రావాలంటే బాబు రావాలని టిడిపి చెప్పిందని, కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారన్నారు. ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. చంద్రబాబు పాలన ప్రజలను విసిగెత్తించేలా ఉందన్నారు. ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా పిలుపునిస్తున్నారన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు. ఎమ్మెల్యేలను కొంటూ ప్రతిపక్షం, ప్రజల గొంతు వినపడవద్దనే దిక్కుమాలిన పనులు చేస్తున్నారన్నారు. చదువుకున్న మనం.. చంద్రబాబు పనిని వ్యతిరేకించాలన్నారు. చూస్తూ ఊరుకోవడం తప్పవుతుందన్నారు.

చంద్రబాబు రెండు సంవత్సరాల్లో రూ.లక్షా 30వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. చంద్రబాబు దాదాపు 31 స్కాంలు చేశారన్నారు. కరెంట్ తక్కువ రేటుకు దొరుకుతుంటే, చంద్రబాబు ఎక్కువ రేటుకు కొంటారని ఎద్దేవా చేశారు. ఇసుక, ల్యాండ్ నుంచి చంద్రబాబు ఎన్నో స్కాంలు చేశారన్నారు.

చంద్రబాబును రూ.ఒక లక్షా 30వేల కోట్ల స్కాంల గురించి అందరూ ప్రశ్నించాలన్నారు. తాము చంద్రబాబు అవినీతి పైన 'ఎంపరర్ ఆఫ్ కరెప్షన్' పుస్తకం రూపొందించామని చెప్పారు. చంద్రబాబు చేసిన అవినీతిని తాము ప్రశ్నిస్తామనే తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు.

అమరావతి అవినీతి...

చంద్రబాబు అవినీతి గురించి తాను ఒకే విషయం చెబుతానని జగన్ అన్నారు. ఆయన తాము తీసుకు వచ్చిన పుస్తకంలోని అమరావతిలో జరిగిన అవినీతి అంటూ ఓ పేజీని తిప్పి మీడియాకు చూపించారు. దాని గురించి వివరించారు. రాజధాని విషయంలో చంద్రబాబు లీకులు ఇచ్చి, కుట్రలకు తెరలేపారని అభిప్రాయపడ్డారు.

అమరావతి ప్రాంతంలో తమ వాళ్లతో భూములు కొనుగోలు చేయించి, ఆ తర్వాత రాజధానిని అక్కడ తీసుకు వచ్చారని ఆరోపించారు. టిడిపి నేతలు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన తర్వాత అక్కడే రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటన చేశారన్నారు.

పలానా చోట రాజధాని వస్తుందని తెలిసి, ఆ ప్రాంతంలో తమకు సంబంధించిన వ్యక్తులతో కొనుగోలు చేయించడం ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా అని ప్రశ్నించారు. ఇది ఓ పెద్ద స్కాం అన్నారు. జోన్ విషయంలోను తమ వాళ్లకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారన్నారు.

రాజధాని ప్రాంతంలో తమ బినామీలు, తమవాళ్లు కొనుగోలు చేసిన చోటుకు డిమాండ్ వచ్చేలా చేశారన్నారు. తాము తీసుకు వచ్చిన ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ పుస్తకంలో చంద్రబాబు గురించిన అవినీతి అన్ని అంశాలను ప్రస్తావించామని చెప్పారు.

తన సన్నిహితుడు లింగమనేని రమేష్ భూమి ల్యాండ్ పూలింగ్ కిందకు రాకుండా చూశారని చెప్పారు. తమ కంటే చంద్రబాబు కూటమికి 1.86 శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయన్నారు.

బాబుకు తన పరిపాలనపై నమ్మకం లేదు

'టిడిపిలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించడం లేదు? ఉప ఎన్నికలకు వెళ్లేందుకు ఎందుకు సిద్ధ పడటం లేదు? తన పరిపాలన పైన తనకే చంద్రబాబుకు నమ్మకం లేదా?' అని మీడియా, ప్రజలు ప్రశ్నించాలని జగన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+