ఏపీలో ముస్లిం దూదేకులకు జగన్ గుడ్ న్యూస్- డబుల్ బొనాంజా ఆఫర్...
ఏపీలో ముస్లిం దూదేకుల సామాజిక వర్గానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వారికి అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఓ డిమాండ్ ను పరిష్కరించారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. దీంతో దూదేకుల సామాజికవర్గం ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము చేసిన ప్రయత్నాలు విజయవంతం కావడంపై ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ కూడా సంతోషం తెలిపింది.
ఏపీలో ముస్లింల్లో ఉపజాతిగా పరిగణిస్తున్న దూదేకులను ప్రభుత్వాలు చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. జనాభా ఎక్కువగా లేకపోవడం, ఉన్నవారిలోనూ విద్యావంతులు తక్కువగా ఉండటం, వారిలో అవగాహన తక్కువగా ఉండటం వంటి కారణాలతో ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల్లోనూ వారికి పూర్తిస్ధాయిలో అందడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కూడా సాధారణ ముస్లింలకు వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయల చొప్పున బహుమతిగా ఇస్తోంది.

కానీ దూదేకులకు, నూర్ బాషాలకు, పింజానీ, లదాఫ్ లకు మాత్రం వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద రూ.50 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీన్ని లక్షకు పెంచాల్సిందిగా కొన్నేళ్లుగా వీరంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై దూదేకుల పొలిటికల్ జేఏసీ కూడా చాలా పోరాటాలు చేసింది. దీని ఫలితంగా ప్రభుత్వం ఇన్నాళ్లకు కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం దూదేకులకు వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇచ్చే మొత్తాన్ని 50 వేల నుంచి లక్ష రూపాయకు పెంచుతూ ఇవాళ జీవో జారీ చేసింది.
ఈ మేరకు దూదేకుల ముస్లిం కులస్తులకు వైఎస్సార్ షాదీ తోఫా పథకంలో ఇబ్బందులను పరిష్కరిస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎం ఇంతియాజ్ ఇవాళ జీవో జారీ చేశారు. దీని ప్రకారం ఇకపై రాష్ట్రంలో దూదేకుల కు షాది తోఫా కింద ప్రభుత్వం లక్ష రూపాయలు అందించనుంది. సమస్య పరిష్కారం కావడంతో దూదేకుల ముస్లిం జేఏసీ నాయకులు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇన్నాళ్లకు తమ విజ్ఞప్తిని మన్నించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications