అమరావతి రైతులకు ప్రభుత్వం షాక్!
ఏపీ రాజధాని అమరావతిని మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 22 గ్రామ పంచాయతీలతో మున్సిపాలిటీ చేసేందుకు గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ అభ్యంతరాలుంటే తెలపాలంటూ గ్రామ పంచాయితీలకు నోటీసులు జారీచేశారు. గతంలో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించింది. 22 గ్రామాల ప్రజలు ప్రతిపాదనను తిరస్కరించారు. 29 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ అన్ని పంచాయితీల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ తెరపైకి వచ్చింది.
రాజధాని పరిధిలో తాడికొండ, మంగళగిరి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు చెందిన రైతులు రాజధాని ఏర్పాటు కోసం వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. వాటిని అభివృద్ధి చేసి రైతులకు అప్పగించాల్సి ఉండగా ప్రభుత్వం మారింది. కొత్త వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానులనడంతో ఈ ప్రాంత రైతులు సుమారు వెయ్యిరోజులుగా నిరసన దీక్షలు చేపట్టారు. ఈనెల 12వ తేదీతో దీక్షలు వెయ్యిరోజులు పూర్తిచేసుకోబోతున్నాయి. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రైతులు మరోసారి అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర తలపెట్టారు. ఈనెల 12వ తేదీనే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతి రాలేదు. ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అన్న ఉద్దేశంతో ఉన్న రైతులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో నే ప్రభుత్వం అమరావతిని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయబోతోంది. గతంలో ఒకసారి తిరస్కరణకు గురవగా ఈసారి కూడా ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తామని రైతులు చెబుతున్నారు. కార్పొరేషన్ చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఏం చేయబోతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.












Click it and Unblock the Notifications