మేకపాటి గౌతంరెడ్డిని గుర్తు చేసుకున్న జగన్-కీలకవ్యాఖ్యలు-సంగం బ్యారేజీ ప్రారంభం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పూర్తి చేసిన సంగం బ్యారేజీని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించారు. నెల్లూరు పర్యటనకు వచ్చిన సీఎం జగన్.. ముందుగా సంగం బ్యారేజీని దివంగత మేకపాటి గౌతంరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వైఎస్సార్, గౌతంరెడ్డి విగ్రహాల్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మేకపాటి కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంగం బ్యారేజీ ప్రారంభం
నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై నిర్మించిన సంగం వద్ద నిర్మించిన సంగం బ్యారేజ్ ను సీఎం జగన్ ఇవాళ జాతికి అంకితం చేశారు. మూడేళ్లలో రూ.131.12 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజ్ పూర్తయింది. ఈ ప్రాజెక్టు ద్వారా నెల్లూరు జిల్లాలో 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానుంది. సంగం-పొదలకూరు మండలాల ప్రజల రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
2006లో మాజీ సీఎం వైఎస్సార్ శంఖుస్ధాపన చేసిన ఈ పనులు ఇప్పటికి పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమమైంది. పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి.. ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించడానికి ఈ బ్యారేజ్ దోహదపడుతుంది.
బ్యారేజ్‌లో 0.45 టీఎంసీలను నిల్వ చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగడం వల్ల తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్య పరిష్కారమైంది.

మేకపాటి, వైఎస్సార్ విగ్రహావిష్కరణ
అలాగే సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవాన్ని దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ప్రారంభించిన సీఎం జగన్.. అనంతరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మేకపాటి, వైఎస్సార్ విగ్రహాలను కూడా ప్రారంభించారు. ఈ రెండు విగ్రహాలను ఈ ప్రాజెక్టు శంఖుస్ధాపన, పూర్తికి సంకేతాలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు సైట్ ను సందర్శించే వారికి ప్రాజెక్టు గుర్తుగా ఈ రెండు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లయింది. ఈ రెండు విగ్రహాల ఆవిష్కరణలోనూ మేకపాటి కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.

జగన్ రుణం తీర్చుకోలేమన్న రాజమోహన్ రెడ్డి
తన కుమారుడు దివంగత మేకపాటి గౌతంరెడ్డి మరణం తర్వాత తమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన సీఎం జగన్ కు మేకపాటి రాజమోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ రుణం తీర్చుకోలేమన్నారు. గౌతంరెడ్డి మరణం తర్వాత రాజకీయంగా తమ కుటుంబానికి అండగా నిలిచిన జగన్.. ఇప్పుడు సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసి గౌతంరెడ్డికి నివాళి అర్పించారని రాజమోహన్ రెడ్డి కొనియాడారు. సంగం బ్యారేజీ అందుబాటులోకి రావడంతో నెల్లూరు ప్రజలు, రైతుల కష్టాలు తీరతాయన్నారు.

గౌతంరెడ్డి గుర్తు చేసుకున్న జగన్
రాష్ట్రంలో దేవుడి దయతో కురుస్తున్న వర్షాలతో ఏ ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. సంగం బ్యారేజీని ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకుని నిర్మాణం పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఓవైపు కోవిడ్, మరోవైపు పెన్నా వరదల్ని ఎదుర్కొని ఈ ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు.
ఎప్పుడో బ్రిటీష్ వాళ్లు కట్టిన ఈ ఆనకట్ట శిధిలావస్ధకు చేరిన దశలో దివంగత సీఎం వైఎస్సార్ దీన్ని సంగం బ్యారేజ్ గా మొదలుపెట్టారన్నారు. దాన్ని పూర్తి చేసే అవకాశం తనకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ మరణం తర్వాత సంగం, నెల్లూరు బ్యారేజీల్ని పట్టించుకునే వారు లేకపోయారన్నారు. ఇప్పుడు తిరిగి తాను రూ.320 కోట్లు ఖర్చుపెట్టి పూర్తి చేశానన్నారు.
ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం కమీషన్లు తీసుకుందని, కానీ తాము మాత్రం ప్రతికూల పరిస్ధితుల్ని లెక్కచేయకుండా ప్రాజెక్టు పూర్తి చేశామని జగన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సిన తన స్నేహితుడు గౌతంరెడ్డి లేకపోవడం లోటని జగన్ పేర్కొన్నారు. గౌతం ఎప్పుడూ మన మనసుల్లో ఉంటాడన్నారు. ఆరోజు గౌతం సంస్మరణ కార్యక్రమంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టామన్నారు.












Click it and Unblock the Notifications