నాడు-నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే-విద్య, వైద్యరంగాలపై అసెంబ్లీలో జగన్ కీలక ప్రసంగం
ఏపీలో విద్య, వైద్య రంగాల్లో అమలవుతున్న నాడు-నేడు కార్యక్రమంపై ఇవాళ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ఇందులో ముందుగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అనంతరం చర్చకు ముగింపుగా ప్రసంగించిన సీఎం జగన్.. రాష్ట్రంలో ఏ స్ధాయిలో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారో సుదీర్ఘంగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులకు తగినట్లుగా రాష్ట్రంలో నాడు-నేడు కార్యక్రమం చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు.

నాడు-నేడుపై జగన్ ప్రసంగం
రాష్ట్రంలో దశాబ్దాల క్రితం నెలకొల్పిన స్కూళ్లలో విద్యార్ధులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం జగన్ తెలిపారు. ఈ దశలో ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లను అలాగే ఉంచి కార్పోరేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా లేమని, అందుకే పోటీ ప్రపంచానికి తగ్గటుగా విద్యార్ధుల్ని, స్కూళ్లను మార్చేందుకు నాడు-నేడు చేపట్టామన్నారు.
వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లేదని, సీబీఎస్ఈ చదువులు లేవని, ప్రభుత్వ రంగంలో స్కూళ్లే లేకుండా చేసే ప్రయత్నాలు జరిగాయని, కార్పోరేట్ రంగంలో కొందరి కోసమే ఇలా చేశారని జగన్ తెలిపారు. మౌలిక సౌకర్యాలు లేకపోయినా, డ్రాపౌట్లు పెరుగుతున్నా పట్టించుకోలేదన్నారు.

చంద్రబాబు సొంతూరులో స్కూళ్లు
గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో స్కూళ్ల పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఫొటోల్ని సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ అదే పరిస్దితి ఉందన్నారు. టాయిలెట్ల పరిస్దితి కూడా ఎలా ఉండేదో, తాము వచ్చాక ఎలా మార్చామో చూపించారు.
కుప్పంలో శాంతిపురం స్కూల్ కూడా నాడు-నేడుతో ఎలా మారిందో జగన్ స్లైడ్ రూపంలో ప్రదర్శించారు. ఇలాంటి మార్పులు చేయకుండా స్కూళ్లను ఎందుకు గాలికి వదిలేశారో అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.

నాడు-నేడుతో స్కూళ్లలో 12 మార్పులు
నాడు-నేడు పథకం ద్వారా ప్రతీ స్కూల్లోనూ 12 మార్పులు జరిగేలా చేశామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రతీ స్కూల్లోనూ మంచి టాయిలెట్లు, నీటి సరఫరా, మరమ్మత్తులు, విద్యుదీకరణ, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్స్, భవనాలకు రంగులు వేయడం, ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్డు నిర్మాణం, అదనపు తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ బోర్డుల ఏర్పాటు చేశామన్నారు. 45 వేల స్కూళ్లు, అంగన్ వాడీల రూపురేఖల్ని మూడు దశల్లో మారుస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇందుకోసం రూ.16 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. నాడు-నేడు తొలిదశ పూర్తయిందని, రెండోదశ కూడా పూర్తవుతోందన్నారు.

స్కూళ్ల నిర్వహణ
ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడుతో పాటు విద్యార్ధుల్ని స్కూళ్లకు రప్పించడం, మెరుగైన నిర్వహణ కోసం ప్రత్యేక నిధుల్ని ఇవ్వడంతో పాటు ప్రత్యేక పథకాల్ని కూడా అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతీ స్కూల్లోనూ 6 వేల గౌరవవేతనంతో ఆయాల్ని నియమించామన్నారు. అమ్మఒడి ద్వారా ప్రతీ పేద విద్యార్ది తల్లికి రూ.15 వేలు ఇవ్వడమే కాకుండా అందులో వెయ్యి రూపాయల్ని టాయిలెట్ల నిర్వహణ నిధికి, మరో వెయ్యి రూపాయలు స్కూళ్ల నిర్వహణ నిధికి ఇస్తున్నట్లు జగన్ వెల్లడించారు.
వీటితో స్కూళ్లలో అవసరమైన మరమ్మత్తులు కూడా చేపట్టేందుకు వీలవుతుందన్నారు. 2035 నాటికి రాష్ట్రంలో అక్షరాస్యతను 70 శాతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగన్ తెలిపారు.

విద్యాపథకాల వెల్లువ
స్కూళ్లకు హాజరయ్యే విద్యార్ధుల శాతం పెంచేందుకు అమ్మఒడితో పాటు జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేస్తున్నామన్నారు. గత మూడేళ్లలో అమ్మఒడికి రూ.17 వేల కోట్లు, గోరుముద్దకు ఏటా రూ.1800 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు జగన్ వెల్లడించారు. అలాగే విద్యాకానుక కింద రూ.886 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు జగన్ తెలిపారు.
అలాగే బైజూస్ కంటెంట్ తో విద్యార్దులకు ట్యాబ్ లు అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఆయాల గౌరవ వేతనాన్ని సైతం రూ.3వేలకు పెంచామన్నారు. ఉన్నత విద్య చదివే పిల్లల కోసం వసతి దీవెన, విద్యాదీవెన వంటి పథకాల్ని కూడా విద్యార్ధుల కోసం అమలుచేస్తున్నామన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లోనూ కరికులమ్ లో భారీ మార్పులు చేసి జాబ్ ఓరియంటెడ్ గా మార్చామన్నారు.

వైద్యరంగంలోనూ పెను మార్పులు
వైద్యరంగంలోనూ భారీ మార్పులు చేపడుతున్నట్లు జగన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రాకముందు గ్రామాల్లో పరిస్దితులు దారుణంగా ఉండేవన్నారు. అక్కడా నాడు-నేడు అమలు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చామన్నారు. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయే పరిస్దితులు, సెల్ ఫోన్ల వెలుగులో ఆపరేషన్లు చేసే పరిస్ధితుల నుంచి ఇప్పుడు నాడు-నేడుతో భారీ మార్పు వచ్చిందన్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ చెప్పారు. ఆరోగ్య శ్రీ అమలు ద్వారా రాష్ట్రంలో వైద్యాన్ని పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications