నెల్లూరులో జగన్ ఎంట్రీ- మళ్లీ అదే రచ్చ- లాఠీ ఛార్జ్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు టూర్ మరోసారి ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. ఈ ఉదయం నెల్లూరుకు హెలికాఫ్టర్ లో చేరుకున్న జగన్ ను చూసేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, జనం తరలివచ్చారు. దీంతో నెల్లూరు సిటీ సందడిగా మారింది. జగన్ హెలికాఫ్ట్టర్ దిగుతుండగానే భారీగా జనం అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ దిగి నగరంలోకి వచ్చే క్రమంలో పోలీసు ఆంక్షల్ని ఛేదించుకుని జనం తరలి వచ్చారు. వీరిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
జగన్ ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్ కు చేరుకుంటారని తెలియడంతో వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కానీ హెలిప్యాడ్ వద్దకు ఎంపిక చేసిన కొంత మంది నాయకులనే పోలీసులు అనుమతించారు. దీంతో నెల్లూరు జిల్లా నేతలు మాత్రమే హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లి జగన్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి జగన్ నేరుగా తాజాగా ఇంటిపై దాడి జరిగిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కలిసేందుకు బయలుదేరారు.

అయితే అప్పటికే ప్రసన్నకుమార్ రెడ్డిని సైతం ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో జగన్ వెళ్లే మార్గంతో పాటు ప్రసన్న నివాసం వద్ద కూడా వైసీపీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు. జగన్ వస్తుండటంతో వీరందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. వారు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. దీంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయినా వారు అక్కడి నుంచి కదలకపోవడంతో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. చివరకు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించారు.
వైసీపీ కార్యకర్తల హంగామా, పోలీసుల లాఠీ ఛార్జ్ మధ్యే జగన్ నెల్లూరు జైలుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ పై ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ లో జగన్ పరామర్శించనున్నారు. దీంతో జైలు వద్దకు కూడా భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో కార్యకర్తల్ని అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టంగా మారుతోంది.












Click it and Unblock the Notifications