సీఎంగా ఉండి అబద్ధాలా ? రెండు నెలలు ఎందుకు లేటు ?లడ్డూ వివాదంపై జగన్ ప్రశ్నలు..!
ఏపీలో తాజాగా సీఎం చంద్రబాబు లేవనెత్తిన తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ అధినేత జగన్ ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. సీఎంగా ఉంటూ అబద్దాలు చెప్పడం ధర్మమా అని ఆయన్ను ప్రశ్నించారు. దేవుడిని రాజకీయాలకు వాడుకోవాలన్న దుర్మార్గ మనస్తత్వం చంద్రబాబుది అన్నారు. సంక్షేమ పథకాల అమల్లో వైఫల్యం, వరదల్లో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జత్వానీ వివాదంతో పాటు లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని చంద్రబాబు జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు 100 రోజుల్లో చేసిన మోసాలు చాలా ఉన్నాయని జగన్ ఆరోపించారు. మంచి ప్రభుత్వం తమది అని చెప్పుకుంటూ స్టిక్కర్ లు అతికిస్తున్నారని ఆక్షేపించారు. వంద రోజుల్లో సూపర్ సిక్స్ లేదూ..సూపర్ సెవెనూ లేదన్నారు. పాలనా లేదన్నారు. ప్రజలకు చెప్పినవి అన్ని కూడా అబద్ధాల మూటగా ,చంద్రబాబు దోషిగా నిలబడ్డాడన్నారు. ఎన్నికలకు వెళ్లినపుడు కార్యకర్తలను పంపించి బాగా ప్రచారం చేశారని, చిన్న పిల్లలు కనిపిస్తే 15 వేలు నీకు..నీకు అని అన్నారని జగన్ గుర్తుచేశారు. ప్రతి ఇంటిలో ఏదో ఒకటి చెప్పి దుర్మార్గ ప్రచారం చేశారన్నారు.

వంద రోజుల్లో చంద్రబాబు చేసింది మోసం..మోసం.మోసం అని జగన్ విమర్శించారు. అన్ని వ్యవస్థలను చంద్రబాబు తిరోగమనం చేశారన్నారు. పిల్లలకు ఫీజ్ కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్నారు.ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు ఒక్క బిల్ క్లియర్ అవ్వలేదన్నారు. 108 సిబ్బందికి జీతాలు లేవన్నారు. అలాగే ఆరోగ్య ఆసరా పట్టించుకున్న నాధుడూ లేడన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చెయ్యడానికి అడుగులు పడుతున్నాయని జగన్ ఆరోపించారు.
రైతులు పూర్తి గా రోడ్డున పడ్డారని, ..రైతు భరోసా లేదు, పెట్టుబడి సాయం లేదు, ఉచిత పంటల బీమా లేదని జగన్ విమర్శించారు. తమ దగ్గర బంధువులు అయిన సంస్థలపై దాడులు చేసారని పోలీసు అధికారులను నటి జత్వానీని అడ్డు పెట్టుకుని సస్పెండ్ చేశారని జగన్ ఆరోపించారు. వరదల సమయంలో అలెర్ట్ ఉన్నా కూడా చంద్రబాబు సమీక్ష చెయ్యలేదన్నారు. అలా చేసి ఉంటే 60 మంది చనిపోయే అవకాశం ఉండకపోయేదన్నారు. విజయవాడ వరదలు , ఏలేరు వరదలు మానవ తప్పిదమే అన్నారు.
బోట్లతో ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసారని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేశారని జగన్ విమర్శించారు. తిరుమల లడ్డూ పేరుతో మరో డైవర్షన్ కు తెరతీశారని జగన్ ఆరోపించారు. దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం చంద్రబాబుదన్నారు. బాబుపై ప్రజలు కోపంతో నిలదీస్తున్నారని, దీంతో చంద్రబాబు దుర్మార్గ ఆలోచన ఈ లడ్డూ కట్టుకథ అని జగన్ ఆరోపించారు.నెయ్యి లో కల్తీ, జంతువుల కొవ్వు వాడారని ముఖ్యమంత్రి హోదా లో ఉండి మాట్లాడారని ఆక్షేపించారు. ఓ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకంగా అబద్ధాలు ఆడడం ధర్మమా అని ప్రశ్నించారు. వెంకటేశ్వరస్వామి భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉంటారని, నెయ్యి సరఫరా కొత్త కార్యక్రమం కాదు..

నెయ్యి సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ తో నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకువస్తారని జగన్ తెలిపారు. మూడు రిపోర్ట్స్ పాస్ కావాలని, ఇవి పాస్ అయితేనే లడ్డూలో వాడుతారన్నారు. ప్రతి ఆరునెలలకు ఆన్ లైన్ లో టెండర్లు పిలుస్తారని తెలిపారు. జులై 12 న నెయ్యి శాంపిల్ రిజెక్ట్ అయింది. చంద్రబాబు సీఎం గా ఉండగా శాంపిల్ తీస్కున్నారుని, జులై 17న ఆ శాంపిల్ ఎన్ డిడి బి కి పంపించారని జగన్ గుర్తుచేశారు. జులై 23న రిపోర్ట్ అయిందిని, మరి చంద్రబాబు రెండు నెలలుగా ఏం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు.
టీటీడీలో లడ్లు తయారు అనేది గొప్ప కార్యక్రమమని, వీటి తయారీకి నెయ్యి అనేక రకాలుగా పరీక్షలు చేస్తారని జగన్ గుర్తుచేశారు. భక్తులు ఇలాంటి లడ్లు తిన్నారని వెంకటేశ్వర స్వామి భక్తులను అభాసుపాలు చేసి. మన గుడి ని మనం తగ్గించుకుంటున్నామని జగన్ విమర్శించారు. టెండర్లు పిలిస్తే ఎవరైనా రావచ్చని, మరి చంద్రబాబు సీఎంగా ఉండగా కె ఎం ఎఫ్ బ్రాండ్ ఎందుకు లేదని ప్రశ్నించారు. రెండు నెలల క్రితం ఎన్ డీ డీ బి రిపోర్ట్ ఇస్తే టీడీపీ ఆఫీసు లో రిపోర్ట్ బయటపెడతారా అని నిలదీశారు. టీటీడీ వ్యవహారానికి సంబంధించి ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి లేఖలు రాస్తామని తెలిపారు. చంద్రబాబు కు టీటీడీ అంశానికి సంబంధించి అక్షింతలు పడాలని లేఖ రాస్తామన్నారు. బీజేపీకి నిజమైన హిందూత్వం ఉంటే చంద్రబాబుకి అక్షింతలు వెయ్యాలన్నారు.












Click it and Unblock the Notifications