గర్భిణీలు-బాలింతల కోసం టేక్ హోమ్ కిట్స్- ప్రారంభించిన జగన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. మరో పథకాన్ని ఇవ్వాళ ప్రారంభించింది. గర్భిణీలు-బాలింతల కోసం ఉద్దేశించిన స్కీమ్ ఇది. గర్బిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తోన్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ- టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు.
పౌష్టికాహార వస్తువులు- పదార్థాలతో కూడిన కిట్ ఇది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా వైఎస్ జగన్ తన చేతుల మీదుగా కొందరు గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఈ కిట్లను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డితో కలిసి అందజేశారు.

అంతకుముందు- వైఎస్ జగన్.. కిట్లను పరిశీలించారు. అందులో ఉండే ఆహార వస్తువులు, పదార్థాల నాణ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద మహిళా- శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ఈ కిట్లను పంపిణీ చేస్తోంది. ఇవ్వాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం వచ్చినట్టయింది.
గర్భిణీలు, బాలింతలకు వారి ఇళ్ల వద్దకే ఈ పౌష్టికాహార కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. వలంటీర్ల ద్వారా లబ్దిదారులకు వీటిని అందజేస్తుంది. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు గర్భిణులు, బాలింతలకు ఆయా ఆంగన్వాడి కేంద్రాల వద్ద పౌష్టికాహారాన్ని అందజేసేవారు. ఇందులో మార్పులు చేసింది ప్రభుత్వం.
తాజాగా ఆయా కిట్లను గర్భిణులు, బాలింతల ఇళ్ల వద్దకే పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా కిట్ల పంపిణీని చేపట్టింది. ఆంగన్వాడి కేంద్రాల వద్దకు వెళ్లి.. వాటిని తెచ్చుకోవడంలో గర్భిణీలు, బాలింతలు పడుతున్న ఇబ్బందులను తొలగించడంలో భాగంగా.. ఈ టేక్ హోమ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

1 నుంచి 15 రోజుల్లోపల లబ్దిదారులకు ఈ కిట్స్ అందుతాయి. ఒక్కో పౌష్టికాహార కిట్‌లో మూడు కిలోల మేలురకం బియ్యం, కేజీ పప్పు, అర లీటరు వంట నూనె, రెండు కేజీల రాగిపిండి, కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరాలు, 13 కోడిగుడ్లు, రెండున్నర లీటర్ల పాలు ఉంటాయి.
రెండో విడతలో 16 నుంచి 30 రోజుల్లోపల వారికి 12 కోడి గుడ్లు, రెండున్నర లీటర్ల పాలను అందజేస్తుంది ప్రభుత్వం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద అందే రేషన్ సరుకుల్లో ఒక కేజీ రాగి పిండి, రెండు కేజీల చిరుధాన్యాలతో కూడిన పిండి, 500 గ్రాముల బెల్లం, 500 గ్రాముల చిక్కీ, 500 గ్రాముల ఎండు ఖర్జూరం, మూడు కేజీల మేలురకం బియ్యం, ఒక కేజీ పప్పు, అర లీటరు వంటనూనె, 25 గుడ్లు, అయిదు లీటర్ల పాలు ఉంటాయి












Click it and Unblock the Notifications