సమైక్యవాదం: వైయస్ జగన్ ఒంటరివాడే?
హైదరాబాద్: సమైక్యవాద నినాదం విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడైనట్లే కనిపిస్తున్నారు. సమైక్యాంధ్ర హీరోగా అవతారం ఎత్తడానికి ప్రయత్నించిన జగన్‌కు ఆ ప్రయోజనాలు అందకుండా చేయాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకున్న వెంటనే తెలంగాణలో పార్టీని వదులుకుంటూ ఆయన సమైక్య నినాదం వినిపించారు.
సమైక్య నినాదం ద్వారా సీమాంధ్రలో తన పార్టీ తప్ప మరోటి ఉండకూడదనే ఎత్తులు వేసిన జగన్‌ను దెబ్బ కొట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కనిపిస్తున్నారు. సమైక్యవాద నినాదంతో శానససభ సమావేశాలను అడ్డుకోవాలనే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వేసిన ఎత్తులను కిరణ్ కుమార్ రెడ్డి పారనీయలేదు. జగన్ ప్రయత్నాలకు గండికొడుతూ తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు సిద్ధపడింది. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర సభ్యులు చర్చకు సహకరించడం ప్రధానమైన మలుపు.

సమైక్యాంధ్ర కోసం కలిసి పనిచేస్తామంటూ చెప్పిన పయ్యావుల కేశవ్ వంటి తెలుగుదేశం నాయకులు కూడా వెనక్కి తగ్గారు. తనకు అనుకూలంగా లేరనే అభిప్రాయంతో ఎపిఎన్జీవోల అధ్యక్షుడు పి. అశోక్ బాబును బలహీనపరచాలనే జగన్ ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. తిరిగి ఎపిఎన్జీవోల అధ్యక్షుడిగా అశోక్ బాబు ఎన్నిక కాకుండా చూడాలనే ప్రయత్నాలను జగన్ చేసినట్లు చెబుతున్నారు. ఉద్యోగ సంఘం ఎన్నికల్లో జోక్యం చేసుకుని చేయి కాల్చుకున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ దెబ్బ తింటుందనే అంచనాలున్నాయి. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కూడా ఎదిరిస్తూ సమైక్యనినాదం వినిపిస్తున్నారు. సమైక్యం తమ నినాదం కాదని, విధానమని ఆయన చెబుతున్నారు. ఆయన కాంగ్రెసుకు దూరమై పార్టీ పెడతారనే ప్రచారం సాగుతోంది. కానీ, అవేమీ ఉండవని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ మాటలను బట్టి అర్థమవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు వ్యక్తి, పార్టీ ఎందుకు పెడతారని ఆయన ఇటీవల అన్నారు.
కాంగ్రెసు అధిష్టానాన్ని కూడా వ్యతిరేకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు తగిన పునాదులను ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. తాము తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోయామని, సమైక్యవాదం ముసుగులో జగన్ విభజనకు సహకరించారని చెప్పడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్లనే రాష్ట్ర విడిపోయిందని కూడా ఆయన చెప్పవచ్చు. మొత్తం మీద, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వైయస్ జగన్‌ను లక్ష్యం చేసుకున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications