సమైక్య ఉద్యమం: ఢీలా పడిన వైయస్ జగన్?

పార్లమెంటు వేదికగా ఢిల్లీలో జరుగుతున్న సమైక్యం అంతిమ పోరులో జగన్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారనేది తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడింది మొదలు రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. జగన్ సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్రలో రోడ్డెక్కారు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రితో సహా అధిష్ఠానంపై ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ దాకా వెళ్లి దీక్ష చేసి వచ్చారు. ఆరుగురు పార్లమెంటు సభ్యులు సొంత ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించి బహిష్కరణ వేటుకు గురయ్యారు. తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనకు దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి దేశమంతా చుట్టి వచ్చారు.
ఇతర రాజకీయ పార్టీలు చివరి నిమిషంలో తెలంగాణను నిలువరించడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుంటే జగన్ మాత్రం కార్యాచరణకు దిగడం లేదు. గత వారం పదిరోజులుగా విభజన అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో ఢిల్లీ వేడెక్కింది. జగన్ పార్టీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీగా జాతీయ మీడియాలో ప్రచారం పొందిన జగన్ పార్టీ రాష్ట్ర విభజనపై నిమ్మకు నీరెత్తినట్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత జగన్, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీలో చేరిన నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డిలను కలిపితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ముగ్గురు పార్లమెంటు సభ్యులున్నారు. అయితే జగన్ పార్టీ నేతలు ఫిబ్రవరి 15న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications