వీఆర్ఏలకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్-చంద్రబాబు రద్దు చేసిన దాన్ని పెంచి మరీ..
ఏపీలో వీఆర్ఏలకు వైసీపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా వారు ఎదురుచూస్తున్న ఓ అంశంపై వారికి ఇవాళ శుభవార్త అందించింది. గత చంద్రబాబు సర్కార్ హయాంలో తొలగించిన ఓ ఆర్ధిక ప్రయోజనాన్ని వారికి తిరిగి కల్పించడంతో పాటు దాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది. దీంతో ఎన్నికల వేళ జగన్ సర్కార్ వారికి ఊరటనిచ్చినట్లయింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో వీఆర్ఏ (VRA) లకు గతంలో 300 రూపాయలు DA ఇచ్చేవారు. గత ప్రభుత్వం ఈ DA ను రద్దు చేసింది. దీంతో గత కొన్నేళ్లుగా దాన్ని పునరుద్దరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ను కలిసి విజ్ఞప్తి కూడా చేశారు. దీంతో అధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. తిరిగి వారికి డీఏ అందించేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఫైల్ సర్క్యులేట్ చేయమని కూడా సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఆ విధంగా సర్కులేట్ అయిన ఫైల్ లో DA ను 300 రూపాయలకు బదులుగా 500 రూపాయలు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ సంతకం కూడా చేశారు. దీంతో వీఆర్ఏలకు ఇకపై రూ.500 డీఏ అందబోతోంది. ఈ నేపథ్యంలో వీఆర్ఏలకు డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ కు , రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, సీఎస్, ఇతర అధికారులకు ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం వైస్ జగన్ కు పలు విజ్ఞప్తులు అందాయి. దీంతో అధికారంలోకి వచ్చాక వీటిపై సమీక్ష చేసి ప్రమోషన్లతో పాటు ఇతర అంశాలపై పలుమార్లు చర్చించారు. వీటి ఫలితంగా ఇప్పుడు డీఏ మంజూరు, పెంపు నిర్ణయం అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఉద్యోగులకు పలు వరాలు ప్రకటిస్తున్న సీఎం జగన్ ఇందులో భాగంగా వీఆర్ఏలకు డీఏ మంజూరు, పెంపు నిర్ణయం కూడా తీసుకున్నారు.












Click it and Unblock the Notifications