అమరావతిలో రియల్టర్లకు జగన్ సర్కార్ ఊరట-ఆ కీలక నిబంధన ఎత్తివేత..
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ను పరిమితంగానే ప్రోత్సహించేందుకు వీలుగా అప్పట్లో టీడీపీ సర్కార్ పెట్టిన ఓ నిబంధనను వైసీపీ సర్కార్ తాజాగా ఎత్తేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అమరావతి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్ధ (సీఆర్డీయే) గతంలో ఇక్కడి గ్రామాల్లో 500 మీటర్లకు లోపు మాత్రమే లే అవుట్లు ఉండాలనే రూల్ పెట్టింది. 500 మీటర్లకు మించిన లే అవుట్లను ఇప్పటివరకూ సీఆర్డీయే అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ నిబంధనను సడలించాలని రియల్టర్ల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో అమరావతి ప్రాంతంలో అభివృద్ధి లేదనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సీఆర్డీయే పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 500 మీటర్ల లోపు మాత్రమే లేఅవుట్లు వేయాలనే నిబంధనను ప్రభుత్వం ఎత్తేసింది. ఈ నిబంధన అమలు వల్ల ఈ ప్రాంతంలో ప్రభుత్వం భారీగా ఫీజుల్ని కోల్పోవడంతో పాటు ఆర్ధిక కార్యకలాపాలు, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోందని భావించింది. దీంతో ఈ రూల్ ఎత్తివేయాలన్న సీఆర్డీయే కమిషనర్ ప్రతిపాదనతో పాటు రియల్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
2009లో వీజీటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి,మంగళగిరి)ఉడాగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో నివాసాల అభివృద్ధికి 500 మీటర్ల లోపు లేఅవుట్ల రూల్ పెట్టారు. ఆ తర్వాత సీఆర్డీయే ఏర్పాటు జరిగాక 2017లో 500 మీటర్ల లోపు లేఅవుట్లకే అనుమతిస్తూ వచ్చారు. 500 మీటర్లు దాటితే అనుమతి ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ రూల్ ఎత్తేయడంతో 14 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో 500 మీటర్ల పైన వేసే లేఅవుట్లకు సైతం అనుమతులు దక్కబోతున్నాయి.












Click it and Unblock the Notifications