జగన్ సమీక్ష: పవన్ కళ్యాణ్‌తో కాపులా, బీసీలా?
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో దూసుకెళ్లిన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సాధారణ ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. ఉప ఎన్నికల విజయాలతో సునాయసంగా సాధారణ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల ధీమాపై వేటు పడింది. పార్టీ ఓటమిపై వైయస్ జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తాము అధికారం కోల్పోవడానికి బిసి ఓటర్లు దూరం చేసుకోవ డమేనన్న నిర్ధారణకు వచ్చినట్లు వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది.
బిసిల విషయంలో టిడిపి తీసుకొన్న నిర్ణయాలే ఆ పార్టీ విజయానికి బాటలు వేశాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఇకపై తాము కూడా బిసి బాట పట్టాలన్న యోచనకు వచ్చినట్లు సమాచారం. బిసిల పక్షాన మున్ముందు బలమైన ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషించాలని వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం సమాలోచనలు చేస్తోంది.

పవన్ కళ్యాణ్ టిడిపికి, బిజెపికి చేసిన ప్రచారం వైయస్సార్ కాంగ్రెసు ఓటమికి ఏ మేరకు కారణమైందనే విషయంపై పెద్దగా సమాలోచన జరిపినట్లు లేదు. పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతు ఇవ్వడం ద్వారా కాపు సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరమైందనే మాట వినిపిస్తోంది. బిసీలతో పాటు కాపులు కూడా దూరం కావడంతో స్వల్ప ఓట్ల తేడాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమి పాలైనట్లు భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ధైర్యంగా సమైక్య నినాదం ఎత్తుకొంది. కానీ ఆ నినాదం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గట్టెక్కించలేకపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా ప్రజల ప్రాధాన్యతలు మారిపోయాయని అంటున్నారు. ఈ వాస్తవాన్ని పసిగట్టడంలో చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరించారని, ఇందులో భాగంగానే బిసికి, కాపుకు డిప్యూటీ సిఎం పదవులు ప్రకటించి, తెలంగాణలో కష్టాల్లో ఉన్న పార్టీని బిసి సిఎం నినాదంతో గట్టెక్కించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇందుకు సంబంధించిన చర్చ ఎన్నికల ఫలితాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జిల్లా సమీక్షా సమావేశాల్లో సాగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో యాభైశాతినికి పైగా ఉన్న బిసి వర్గాలను ఆకట్టుకోవడంలో తాము విఫలం అయ్యామని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి సైతం తన అభిప్రాయాన్ని పార్టీ ముఖ్యలవద్ద వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దీన్ని సరిచేసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications