స్థానిక ఎన్నికల ఫలితాలపై జగన్ సెటైరికల్ ట్వీట్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షం అయ్యాయి. రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలను సైతం కూల్చివేసింది.
ఈ ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెటైరికల్ గా స్పందించారు. చంద్రబాబుతో పాటు పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను అభినందించారు. కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారాయన. ఎన్నికల సరళి ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా సాగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం, పోలీస్, ఎస్ఈసీ కుమ్మక్కై ప్రతిపక్షాలకు కనీస పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా విజయం సాధించాయని చురకలు అంటించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరిగినవి ప్రజాస్వామ్యబద్ధమైన 'ఎన్నికలు' కావని, అధికార యంత్రాంగం అండతో నిర్వహించిన 'సెలక్షన్లు' మాత్రమేనని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు. ప్రతిపక్ష అభ్యర్థులు పోటీలో నిలబడకుండా ప్రతి స్థాయిలోనూ అడ్డంకులు సృష్టించి, ఫలితాలను ఏకపక్షంగా మార్చుకున్నారని ఆరోపించారు. కూటమి వైఖరిని ఎండగట్టారు.
ఎన్నికల ప్రక్రియలోని ప్రతి ఘట్టంలోనూ వ్యూహాత్మక అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్ పాయింట్ల వారీగా వివరించారు. నామినేషన్ల స్వీకరణ, వాటి స్క్రూటినీ, ఉపసంహరణ సమయాల్లో ప్రతిపక్ష అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి రాకుండా అడ్డుకున్నారని, వారిని బలవంతంగా బయటకు పంపారని జగన్ ధ్వజమెత్తారు. పోలింగ్ శాతాన్ని మేనేజ్ చేయడంతో పాటు లెక్కింపు ప్రక్రియను కూడా హైజాక్ చేశారని, అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోలేదని, ప్రభుత్వమే ఎంపిక చేసిందని అన్నారు.
Congratulations, Team @ncbn, Police, and SEC!You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!At every stage, the process was rigged:* Nomination: Hijacked!* Scrutiny: Hijacked!* Withdrawal: Hijacked!* Polling agents: Obstructed or Pulled Out!* Poll: Rigged!* Poll percentage: Manipulated!* Counting: Hijacked!You selected the candidates; the people never elected them!These are no longer elections but selections!The need for electoral reforms has never been more obvious!#CBNJungleRaj@ECISVEEP
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 3, 2026
ఇటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్య పునాదులనే కదిలిస్తున్నాయని, అందుకే దేశంలో తక్షణమే సమగ్ర ఎన్నికల సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు.. అధికార కూటమికి అనుకూలంగా మారడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని జగన్ చెప్పారు. ప్రజల ఓటు హక్కుకు రక్షణ కల్పించి, ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పునరుద్ధరించాలంటే ఎన్నికల నిర్వహణ తీరు మారాలని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
