చీరాల కౌంటింగ్ వాయిదా..! ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ..!
రాష్ట్రంలో ఇవాళ 92 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో మురసు తుఫాన్ కారణంగా పలు చోట్ల కౌంటింగ్ కు ఆటంకాలు తప్పలేదు. కొన్ని చోట్ల ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. మరికొన్ని చోట్ల అసలు ప్రారంభించే పరిస్ధితి కూడా లేకుండా పోయింది. ఇలాంటి వాటిలో చీరాల (Chirala) మున్సిపాలిటీ కూడా ఉంది. దీంతో అక్కడ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో మురసు తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి చీరాల మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు చేపట్టే పరిస్ధితి లేకపోవడంతో అధికారులు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చారు. మురసు తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయని, కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో అయితే ఏకంగా 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఎస్ఈసీకి నివేదించారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించడం వల్ల పలు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

దీంతో జిల్లా అధికారుల నివేదిక మేరకు చీరాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఈసీ తాజా ఉత్తర్వుల ప్రకారం చీరాల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 6న ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారు. సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. మిగతా చోట్ల మాత్రం యథావిధిగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా చోట్ల ఫలితాలు కూడా ప్రకటించారు. మరికొన్ని ఫలితాలు ఇవాళ రాత్రికల్లా వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
