ఏపీలోని ఈ జిల్లాలను ముంచెత్తిన మురసు తుఫాన్- చివురుటాకులా వణికిన చీరాల
ఏపీ దక్షిణ తీరాన్ని తీవ్ర తుఫాన్ మురసు ముంచెత్తింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే ప్రక్రియ పూర్తయింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాలలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భయానక ఈదురుగాలులు వీస్తోన్నాయి. బీభత్సాన్ని సృష్టిస్తోన్నాయి. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్ పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తోన్నాయి. కుండపోత వర్షం పడుతోంది.
తీరం వెంట సముద్రం తీవ్ర అలజడిగా మారడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కెరటాలు 1.5 నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. ఈ తుఫాన్ ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఈ తెల్లవారుజామున 5:30 గంటల మధ్య ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తీరం దాటినట్లు అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న వెల్లడించారు. తుఫాన్ కేంద్రం 15.53 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 18.22 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద తీరాన్ని తాకిందని అన్నారు.

తీరం దాటే సమయంలో ఈదురుగాలుల వేగం గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వరకు నమోదయ్యాయని, గరిష్ఠంగా 120 కిలోమీటర్లకు చేరిందని వివరించారు. ప్రస్తుతం ఈ తుఫాను ఒంగోలుకు తూర్పు-ఆగ్నేయంగా 20 కిలోమీటర్లు, బాపట్లకు దక్షిణ-నైరుతిగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్య కోస్తాతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని నాగరత్న చెప్పారు.
తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని నాగరత్న తెలిపారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసర సేవలు, విపత్తు నిర్వహణ విభాగాలను పూర్తిగా సిద్ధంగా ఉంచారు. కృష్ణా, ప్రకాశం, బాపట్ల తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి అధికంగా ఉంటోంది. తీరం వెంబడి చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
తీరప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నందున బుధవారం ఉదయం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఐఎండీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సముద్ర తీరంలో సాగే అన్ని రకాల ఆఫ్‌షోర్, ఆన్‌షోర్ కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా పూర్తిగా రద్దు చేశారు. వాతావరణ పరిణామాలు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అందించే సూచనలను మాత్రమే పాటించాలని నాగరత్న వెల్లడించారు.
ఈ తెల్లవారు జామున 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అత్యధిక వర్షపాతం వివరాలను విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 198.01 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. కొత్తపట్నం- 182.25, బాపట్ల- 128.53, చీరాల- 124.10, త్రోవగుంట- 116.93, ఒంగోలు అర్బన్- 106.97, చిలకపాడు- 104.50, సంతనూతలపాడు 98.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 96.9, కోనసీమ జిల్లా మలికిపురంలో 93.7మిమీ వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications
