ఆడవాళ్ళను అవమానిస్తే సహించమని వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్!
తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా పెన్షన్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీతక్కను టార్గెట్ చేశారు. మంత్రి సీతక్క, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలాయి. పరస్పర విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పెన్షన్ ల విషయంలో సీతక్కను టార్గెట్ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి పెన్షన్ల పండుగ పేరుతో కొద్ది మందికి మాత్రమే పాత రూ. 2,000 ఇస్తూ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు.కేసీఆర్ గారి హయాంలో నిజామాబాద్ జిల్లాలో 2,79,177 మందికి పెన్షన్ అందగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 17,131 మందిని తొలగించి, ఇప్పుడు కొత్తగా 20,555 మందికి ఇస్తోంది. అంటే జిల్లాలో నికరంగా పెరిగిన పెన్షన్లు కేవలం 3,424 మాత్రమే అని పేర్కొన్నారు.

ఈ కొద్దిమంది కోసం 31 మండలాల్లో మీటింగ్‌లు పెట్టి ప్రచార ఆర్భాటం చేయడం ప్రజలను వంచించడమే. కొత్త పెన్షన్ల కంటే ఆ మీటింగ్‌ల ఖర్చే ఎక్కువవుతుంది. నా లెక్కలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేయటానికి సిగ్గుండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ముప్కాల్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను మంత్రిగా ఉండటాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వెంట పడుతూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను కాళ్లు మొక్కించుకునే సంస్కృతికి చెందిన వ్యక్తిని కాదని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ కాళ్లు మొక్కించుకునే వారిని తరిమికొట్టే సంస్కృతి తనదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కరోనా వంటి కష్టకాలంలోనే తాను ప్రజల పక్షాన ఉన్నానన్నారు. తాను ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని గుర్తుచేశారు. ఆ సమయంలో కూడా కొందరు తన సేవలను గుర్తించకుండా హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం కష్టపడిన తనపై నేడు రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన 'సిగ్గుండాలి' వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏ విధమైన రాజకీయ సంస్కారమని ప్రశ్నించారు. మహిళలను అవమానించే వారి వెంట పడి కొట్టిన చరిత్ర తనదని, మహిళల ఆత్మగౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీతక్క.
రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా మహిళలను అవమానించే స్థాయికి దిగజారడం సరికాదని మంత్రి సీతక్క హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే సంస్కారం ఇదేనా? అంటూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని సైతం సీతక్క నిలదీశారు. మహిళల గౌరవం, ఆత్మగౌరవం గురించి మాట్లాడే సమయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications
