రూ. 12కే బంగారం, రూ. 15కే వెండి: ఎగబడి కొంటున్న జనం.. అసలు విషయం తెలిస్తే షాకే!
మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.25 లక్షల వద్ద, కిలో వెండి ధర రూ.1.50 లక్షల వద్ద ఆకాశాన్నంటుతున్నా.. సామాన్యులు, చిన్న ఇన్వెస్టర్లు మాత్రం కేవలం రూ.12కే బంగారం, రూ.15కే వెండి కొనుగోలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. డిజిటల్ పెట్టుబడుల వైపు మారిన ట్రెండ్ కారణంగా భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు గోల్డ్, సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు. అయితే రూ.12, రూ.15 అంటే నిజంగానే బంగారం, వెండి చౌకగా దొరుకుతున్నాయా? దీని వెనుక ఉన్న అసలు లెక్కేంటి?
రూ.12, రూ.15కే యూనిట్లు!
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో టాటా గోల్డ్ ఈటీఎఫ్, గ్రో గోల్డ్ ఈటీఎఫ్, ఏంజెల్ వన్ గోల్డ్ ఈటీఎఫ్, డీఎస్పీ గోల్డ్ ఈటీఎఫ్స్ ఒక్కో యూనిట్ ధర సుమారు రూ.12 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. టాటా, గ్రో, కోటక్, డీఎస్పీ, క్వాంట్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఒక్కో యూనిట్ సుమారు రూ.15 వద్ద లభిస్తుండగా.. ఏంజెల్ వన్ సిల్వర్ ఈటీఎఫ్ యూనిట్ కేవలం రూ.5కే అందుబాటులో ఉంది. భౌతికంగా ఒక్క గ్రాము బంగారం కొనాలన్నా సుమారురూ.13 వేలు కావాల్సిన పరిస్థితుల్లో, ఇంత తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు.

ఇది చౌక కాదు.. చిన్న యూనిట్ మాత్రమే!
పెట్టుబడుల ప్రపంచంలో రూ.12 ఉన్న ఈటీఎఫ్, రూ.100 ఉన్న ఈటీఎఫ్ కంటే చౌక అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఓ ఫండ్ హౌస్ తన ఓ యూనిట్‌ను ఎంత పరిమాణం బంగారం లేదా వెండితో అనుసంధానం చేసిందనే దానిపై ఆ యూనిట్ ధర ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,000 ఉంటే.. అందులో 0.001 గ్రాముల విలువ సుమారు రూ.12 అవుతుంది. అంటే బంగారం తక్కువ ధరకు రావడం లేదు కానీ విద్యార్థులు, ఉద్యోగులు, కొత్తగా పెట్టుబడి పెట్టేవారు తన స్తోమతకు తగ్గట్టుగా ప్రతినెలా చిన్న మొత్తాలతో బంగారం, వెండిని జమ చేసుకునే వెసులుబాటు దీనివల్ల కలుగుతోంది. ఇటీవల బంగారం, వెండి ధరలు కాస్త తగ్గినప్పుడు తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం ఇన్వెస్టర్లకు దక్కింది.
ఈటీఎఫ్‌ల వైపు ఎందుకింత క్రేజ్?
భౌతికంగా బంగారం కొంటే తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ అదనపు భారమవుతాయి. ఈటీఎఫ్‌లలో ఈ బాధ ఉండదు. ఇందులో 99.5 శాతం నుంచి 99.9శాతం స్వచ్ఛమైన బంగారం, వెండి ఉంటుంది. డీమ్యాట్ ఖాతాలో సురక్షితంగా ఉండటం వల్ల దొంగల భయం, లాకర్ ఛార్జీలు ఉండవు. మార్కెట్ పనివేళల్లో ఎప్పుడైనా ప్రస్తుత మార్కెట్ ధరకు యూనిట్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లోని గోల్డ్/సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoF)తో పోలిస్తే ఈటీఎఫ్‌లలో ఖర్చులు (ఎక్స్‌పెన్స్ రేషియో) తక్కువగా ఉంటాయి.
రికార్డు స్థాయిలో పెట్టుబడులు
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాల ప్రకారం.. 2026 సెప్టెంబర్ నాటికి గోల్డ్ ఈటీఎఫ్స్ మొత్తం నిర్వహణ ఆస్తుల విలువ రూ.1,86,310 కోట్లు దాటగా.. సిల్వర్ ఈటీఎఫ్స్ విలువ రూ.81,636 కోట్లకు చేరింది. గతేడాది కాలంలో భారతీయ ఇన్వెస్టర్లు ఈ రెండింటిలో కలిపి రికార్డు స్థాయిలో రూ.88.505 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ధరలు తగ్గినప్పుడు భయపడి అమ్మేయకుండా ఇన్వెస్టర్లు మరింతగా కొనుగోలు చేయడమే ఈ భారీ వృద్ధికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే కేవలం యూనిట్ ధర రూ.12 ఉందని కాకుండా ఆ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్, లిక్విడిటీని పరిశీలించి పెట్టుబడి పెట్టడం ఉత్తమం.














Click it and Unblock the Notifications
