విజయవాడ, విశాఖలో డిప్యూటీ మేయర్ల ఎన్నికలు-ఎస్ఈసీ నోటిఫికేషన్ ..!
ఏపీలో తాజాగా 92 పట్టణ స్ధానిక సంస్థల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఇందులో మేయర్లు, కార్పోరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు ఉన్నారు. వీరు కాకుండా మున్సిపల్ కార్పోరేషన్లలో డిప్యూటీ మేయర్ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరగాల్సి ఉంది. దీంతో త్వరలోనే వీటిని నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ap sec) ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ప్రధానమైన పిజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పోరే్షన్లలో డిప్యూటీ మేయర్ల ఎన్నికలకు ముందుగా నోటిఫికేషన్ ఇచ్చింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం విజయవాడ నగర పాలక సంస్థతో పాటు విశాఖపట్నం మహానగర పాలక సంస్దలోనూ డిప్యూటీ మేయర్ ఎన్నికలను నవంబర్ 9న నిర్వహించనున్నారు. ఇందుకోసం ముందుగా అంటే నవంబర్ 4 ఆయా జిల్లాల కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్లు మేయర్ తో పాటు సభ్యులకు నోటీసులు జారీ చేస్తారు. అనంతరం నవంబర్ 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఈ రెండు కార్పోరేషన్లలోనూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో డిప్యూటీ మేయర్ ను కార్పోరేటర్లు ఎన్నుకుంటారు.

మరోవైపు ఏదైనా కారణంతో నవంబర్ 9న ఈ రెండు చోట్ల డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాకపోతే.. మరుసటి రోజు అయిన నవంబర్ 10న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇలాంటి పరిస్ధితుల్లో నవంబర్ 10న ఉదయం 11 గంటలకు కౌన్సిల్ భేటీ నిర్వహించి డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కూడా ఎన్నిక సాధ్యపడకపోతే మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు దానికి గల కారణాలు అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నికల కమిషన్ నివేదికల ఆధారంగా డిప్యూటీ మేయర్ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చారు.













Click it and Unblock the Notifications
