ఏపీలో ప్రారంభ ఫలితాల్లో దూసుకెళ్తోన్న పార్టీలు ఇవే
ఏపీలో 92 స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ఆరంభమైంది. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉదయమే చేరుకున్నారు. 2024 నాటి శాసనసభ ఎన్నికల భారీ విజయం తర్వాత అధికార ఎన్డీఏ కూటమి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది.
మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల 1వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తోన్నారు ఎన్నికల సిబ్బంది. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి వంటి కార్పొరేషన్లల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంటోంది.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం కోసం జరుగుతున్న త్రిముఖ పోటీ ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిదే. ఇక్కడ కూటమి మద్దతుతో జనసేన పార్టీ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పోటీ చేశారు. వైసీపీ తరఫున మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థిగా బరిలో దిగారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెళ్తోంది. విశాఖపట్నంలో టీడీపీ మేయర్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. గ్రేటర్ విశాఖ పోస్టల్ బ్యాలెట్లల్లో ఈ ఉదయం 9 గంటల వరకు మొత్తం 437 ఓట్లను లెక్కించారు. ఇందులో టీడీపీ- 214, వైసీపీ- 134, ఇతరులు- 85 ఓట్లు పడ్డాయి. ఇందులో మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా దాదాపుగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కూటమి క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది.
లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మూడంచెల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోన్నారు. మధ్యాహ్న సమయానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి అన్ని స్థానాల పూర్తి స్థాయి ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
