లిక్కర్, ఇసుక స్కాంలో నిండా మునిగారు: జగన్ ఫైర్
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసార ప్రబలిన ఘటనలో 11 మంది మరణించడం పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆరోపించారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ- విజయనగరం జిల్లాలో సంభవించిన అతిసార మరణాలేనని అన్నారు.

11 మంది మరణించినా, వందల సంఖ్యలో బాధితులు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడట్లేదంటూ జగన్ మండిపడ్డారు. గుర్ల మండలానికి సమీపంలోనే విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆసుపత్రులు ఉన్నప్పటికీ స్థానిక పాఠశాలలో బెంచీల మీద అతిసారా బాధితులకు చికిత్స అందించడం దారుణమని ధ్వజమెత్తారు.
నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, లిక్కర్, ఇసుక స్కాంలల్లో నిండా మునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికి వదిలేశారంటూ జగన్ విమర్శించారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత సిబ్బందికి సరిగ్గా జీతాలు కూడా అందట్లేదని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 1,800 కోట్ల రూపాయల బకాయిలు గత మార్చి నుంచి పెండింగ్‌లో పెట్టారని అన్నారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారని, జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారని విమర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారని, విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలను నాశనం చేశారని అన్నారు.

చంద్రబాబు పాలనలో ఫ్యామిలీ డాక్టర్ ఊసే లేకుండా పోయిందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయని, కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారని, కుంభకోణాలకు పాల్పడుతూ వాటిని అమ్మడానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధమౌతున్నారని చెప్పారు.
కొత్త మెడికల్ కాలేజీలను తన వారికి కట్టబెట్టడానికి చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేస్తోన్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తోన్నాయని అన్నారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని, డయేరియా బాధిత గ్రామాల్లో నాణ్యమైన వైద్యం, మంచినీటి వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications