నరసరావుపేటపై జగన్ కొత్త ఎత్తు
YS Jagan: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటోన్న మార్పులు చేర్పులు కొత్త సమీకరణాలకు దారి తీస్తోన్నాయి. టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆశావహులు రాజీనామాల బాట పడుతున్నారు. వైసీపీ అగ్రనాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు.
ఇప్పటికే మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి.. పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరడానికి ఆయన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్నారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్, దాడి వీరభద్రరావు.. వంటి నేతలు గుడ్ బై చెప్పారు.

ఇక తాజాగా- నరసరావుపేట లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. టికెట్ దక్కే అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారాయన.
ఈ సారి ఎన్నికల్లో వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నరసరావుపేట లోక్‌సభ స్థానాన్ని కేటాయించాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణం. నరసరావుపేటకు బదులుగా గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం చేసిన సూచనలు నచ్చకపోవడం వల్లే లావు.. వైసీపీకి గుడ్‌బై చెప్పారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో- నరసరావుపేట లోక్‌సభ నుంచి బీసీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. దీనికోసం రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకటి- నెల్లూరు సిటీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రెండు- రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు.
ఇద్దరిలో ఒకరిని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా లోక్‌సభ రేసులో నిల్చోబెట్టొచ్చని చెబుతున్నారు. నెల్లూరు సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి సరైన అభ్యర్థి దొరికితే- అనిల్ కుమార్ యాదవ్‌ను నరసరావుపేటకు పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో- వారిద్దరికీ ప్రత్యామ్నాయంగా మూడో పేరు కూడా ప్రతిపాదనల్లో ఉందని తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు కూడా పరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు. 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గుంటూరు లోక్‌సభ నుంచి పోటీ చేసిన మోదుగుల.. టీడీపీకి చెందిన గల్లా జయదేవ్‌పై స్వల్ప తేడాతో ఓడిపోయారు.












Click it and Unblock the Notifications