ఎల్లుండి జగన్ ఆ జిల్లా పర్యటన ఫిక్స్- గ్రౌండ్ లెవెల్ లో జోష్.. !!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాజాగా మరో జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ నెల 30న ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అడుగు పెట్టనున్నారు. కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఎదుర్కొంటున్న పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును స్వయంగా పరామర్శించనున్నారు జగన్.
శ్రీకాకుళం అంపోలులో గల జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. సీదిరి అప్పలరాజు. ములాఖత్ నిబంధనల ప్రకారం జగన్ ఆయనను కలుసుకోనున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీ నాయకులపై లేనిపోని అక్రమ కేసులు బనాయించారని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు మొదటి నుంచి గట్టిగా వాదిస్తూ వస్తోన్నాయి. ఈ కష్టకాలంలో జైలులో ఉన్న అప్పలరాజును ప్రత్యక్షంగా కలిసి, ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు నైతిక మద్దతు, భరోసాను అందించడానికి జగన్ స్వయంగా కలుసుకోనున్నారు.

విపక్షాలకు చెందిన ముఖ్య నాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అక్రమ కేసులు, రాజకీయ వేధింపుల పట్ల వైఎస్ఆర్‌సీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులపై అనేక చోట్ల దాడులు, తప్పుడు కేసులు నమోదవుతుండటంతో క్యాడర్‌లో ఒక విధమైన ఆందోళన నెలకొంది. ఈ ప్రతికూల పరిస్థితులతో పోరాడేందుకు కేడర్‌లో ధైర్యాన్ని నూరిపోయడానికి, వారిని రాజకీయంగా ముందుకు నడిపించడానికి ఈ శ్రీకాకుళం జిల్లా పర్యటన అత్యంత కీలకంగా మారనుంది.
ఈ పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్‌సీపీ యంత్రాంగం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను వేగవంతం చేసింది. అధినేత పర్యటన ఖరారు కావడంతో జిల్లాలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పర్యటనను విజయవంతం చేయడానికి నిరంతర సమీక్షలు జరుపుతున్నారు. మరోవైపు అంపోలు జిల్లా జైలు పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు స్థానిక పోలీసు అధికారులు కూడా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.













Click it and Unblock the Notifications