ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. నిరాహార దీక్ష ప్రారంభించిన తల్లిదండ్రులు
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ కుమారుడిని వేధించి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సాహిల్ తల్లిదండ్రులు ముంబైలోని ఆజాద్ మైదాన్ లో గురువారం నిరాహారదీక్ష ప్రారంభించారు. మరోవైపు సాహిల్ వాకోడే ఆత్మహత్యపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఐఐటీ బాంబే కీలక నిర్ణయం తీసుకుంది. మిడ్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 26-27 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 10-11 తేదీలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సాహిల్ సూసైడ్ కేసుపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
ఇక అంతకుముందు సాహిల్ తండ్రి రవీంద్ర వాకోడేను నిర్బంధించారు. అతను ఐఐటీ బాంబే క్యాంపస్ వైపునకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రవీంద్ర వాకోడే మాట్లాడుతూ.. తన కుమారుడ్ని కులం పేరుతో వేధించిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. క్యాంపస్ లో తనపై అనేకసార్లు కులవివక్ష జరిగిందని సాహిల్ చెప్పినట్లు తండ్రి రవీంద్ర గుర్తుచేశారు. 22 ఏళ్ల ఎనర్జీ సైన్య్ డిపార్ట్ మెంట్ విద్యార్థి సాహిల్ వాకోడే సెప్టెంబర్ 18 న సాయంత్రం తన హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కొద్ది గంటల ముందే పరీక్ష హాల్ లో సాహిల్ ఎగ్జామ్ రాస్తూ ఏఐ ప్లాట్ ఫామ్ ను వినియోగించాడన్న ఆరోపణలు వచ్చాయి. అతడు మాస్ కాపీయింగ్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని ఆరోపణ వ్యక్తం అయింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఐఐటీ బాంబే రిలీజ్ చేసింది. ప్రస్తుతం క్యాంపస్ లోని సీసీటీవీ ఫూటేజ్ ల ఆధారంగా ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు సాహిల్ తల్లిదండ్రులు ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఐఐటీ ముంబై రిలీజ్ చేసిన సీసీటీవీ ఫూటేజ్ లను తోసిపుచ్చారు. విడివిడిగా ఉన్న కొన్ని కొన్ని క్లిప్స్ ను మాత్రమే ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఛైర్మన్ కిషోర్ మక్వానాను కలిసి తమ డిమాండ్స్ కు సంబంధించిన పత్రాన్ని అందజేశారు. ఇక ఈ ఘటనపై కమిషన్ సూమోటోగా కేసును నమోదు చేసి కంప్లైంట్ ను రిజిస్టర్ చేసింది.












Click it and Unblock the Notifications
