టిడిపిని అడిగాం: అవిశ్వాస తీర్మానంపై జగన్, లోకసభ జనరల్ సెక్రటరీకి నోటీసులు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కేంద్రంపై ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానంపై సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడుతోందని చెప్పారు. ఈ మేరకు నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కులు, ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు.
చర్చకు అవకాశం ఇవ్వడం లేదు
ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని జగన్ పేర్కొన్నారు. పదిహేను రోజులుగా పార్లమెంటులో పోరాడుతున్నప్పటికీ చర్చకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. అవిశ్వాసానికి మద్దతివ్వాలని టీడీపీ సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కోరామన్నారు.

అందరికీ లేఖలు ఇచ్చారు
తాము ప్రవేశ పెట్టననున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు అన్ని పార్టీల ఎంపీలకు లేఖలు ఇచ్చారని జగన్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా రోజే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.

మద్దతు అడిగారని జితేందర్ రెడ్డి
తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వైసీపీ ఎంపీలు తమను కోరారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి వేరుగా తెలిపారు. తమ పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇప్పటికే టీడీపీ మద్దతు
కాగా, వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతిస్తామన్నారు. ఇదిలా ఉండగా, మోడీ ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోకసభ జనరల్ సెక్రటరీని కలసి నోటీసులను అందజేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిందని, ఆ తర్వాత హామీని విస్మరించిందంటూ నోటీసులో పేర్కొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తమ అవిశ్వాస తీర్మానాన్ని కేంద్రం ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. వాస్తవానికి అవిశ్వాస తీర్మానాన్ని మార్చి 21న పెట్టాలని గతంలో వైసీపీ భావించింది. అయితే, వ్యూహాత్మకంగా ఆ తేదీని ముందుకు తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications