సోనియాకు పార్టీని అమ్మేస్తున్న జగన్, రోజా! నీకు తెలియదా: సోమిరెడ్డి
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా పైన తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రోజా తన వైఖరి మార్చుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు. తమ పార్టీ నేత నారా లోకేష్ గురించి మాట్లాడుతున్న రోజాకు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి తెలియదా అని ఎద్దేవా చేశారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు వీడితున్నారో కూడా చెప్పారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో వైయస్ జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వైసిపిని హోల్‌సేల్‌గా కాంగ్రెస్ పార్టీకి జగన్ అమ్మకానికి పెట్టారని, అందుకే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని కొత్త విషయం చెప్పారు.

రోజా వ్యక్తిగత ద్వేషం: అనురాధ
అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేత జగన్ కేంద్రమంత్రులను, ఈసీని కలవడం విడ్డూరమని టిడిపి నేత పంచుమర్తి అనురాధ గురవారం అన్నారు. సాక్షి దినపత్రికలో వచ్చిన శుద్ధ అబద్ధ కథనాలతో పుస్తకం వేశారని ఆమె మండిపడ్డారు.
జగన్ మాదిరిగా తమ నేతలకు విలాస భవనాలు లేవన్నారు. మోసగాళ్లు, నేరగాళ్లు తప్ప వైసిపిలో ఎవరూ ఉండరని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత ద్వేషంతో నగరి ఎమ్మెల్యే రోజా వ్యవహరిస్తున్నారని, టిడిపి కార్యకర్తల చేతిలో రోజాకు శృంగభంగం తప్పదని అన్నారు. రాజకీయాల నుంచే రోజాను బహిష్కరించే పరిస్థితి వస్తుందన్నారు.
నారాయణతో ఎమ్మెల్యే వాగ్వాదం
పెళ్లకూరు, కొత్తూరు గ్రామాల్లో సిమెంటు రోడ్డుకు మంత్రి నారాయణ శుక్రవారం పూజ చేశారు. అనంతరం ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించారు. తమను పిలువలేదని స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీపీ సత్యనారాయణ రెడ్డిలు వేదిక వద్ద నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య, మంత్రి నారాయణల మధ్య వాగ్వాదం జరిగింది.












Click it and Unblock the Notifications